Infinity Vizag Summit: ‘ఐటీ’ కెరటం విశాఖపట్నం

Infinity Vizag summit gets inaugurated in City - Sakshi

ఇన్ఫినిటీ సమ్మిట్‌లో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ప్రశంసలు

పెద్ద ఎత్తున నిపుణులతోపాటు నగరంలో అద్భుతమైన ఎకో సిస్టమ్‌

న్యూ టెక్నాలజీ గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌ అడుగులు

విశాఖలో ఘనంగా ప్రారంభమైన ఇన్ఫినిటీ సమ్మిట్‌ 2023 

సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ సంస్థలను రప్పించేందుకు విశాఖలో శుక్రవారం ప్రారంభమైన ఇన్ఫినిటీ వైజాగ్‌ సమ్మిట్‌ 2023 సదస్సు తొలిరోజు విజయవంతమైంది. ఐటీ, ఐటీ అధారిత రంగాలకు ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించడంలో అధికారులు, ఐటీ అసోసియేషన్‌ ప్రతినిధులు సఫలీకృతమయ్యారు. హోటల్‌ మారి­యట్‌లో ఇన్ఫినిటీ వైజాగ్‌ సమ్మిట్‌ను కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అల్కేష్‌కుమార్‌శర్మ, ఎస్‌టీపీఐ డైరె­క్టర్‌ జనరల్‌ అరవింద్‌కుమార్, రాష్ట్ర ఐటీ శాఖ కార్య­దర్శి సౌరభ్‌ గౌర్, సెయింట్‌ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐటాప్‌ రాష్ట్ర అధ్య­క్షుడు శ్రీధర్‌ కొసరాజు, ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు సంయుక్తంగా ప్రారంభించారు. తొలి రోజు మైక్రోసాఫ్ట్, సీమెన్స్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, సెయింట్, బాష్, టెక్‌ మహింద్రా, సైబర్‌ సెక్యూ­రిటీ, ఐశాట్‌ తదితర 60 సంస్థలకు చెందిన ప్రతిని­ధులు హాజరయ్యారు. 12 సంస్థలు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు ఎలాంటి సాయం అవసరమైనా కేంద్రం ముందుంటుందని, విస్తరణ దిశగా అడుగులు వేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచించారు. 

ఐటీ కొత్త డెస్టినేషన్‌ విశాఖ
స్టార్టప్‌లు, డీప్‌టెక్‌కు అపార భవిష్యత్తు ఉంది. సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా విశాఖ సరికొత్త ఐటీ డెస్టినేషన్‌గా ఆవిర్భవిస్తోంది. ఇక్కడ పెద్ద ఎత్తున నిపుణులతోపాటు అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఉంది. రాబోయే సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు 20 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల్లో భారత్‌ ప్రపంచంలో మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటుందని భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఐటీ, ఐటీఈఎస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆన్‌లైన్‌ సొల్యూషన్స్‌ తదితర రంగాల నుంచి 1 ట్రిలియన్‌ డాలర్లు రాబట్టగలమని కేంద్రం అంచనా వేస్తోంది. 
– అల్కేష్‌కుమార్‌ శర్మ, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి

పెట్టుబడులకు అదే ప్రధాన మార్గం..
అమెరికాలో 638 యూనికార్న్‌ కంపెనీలు ఉండగా 80 శాతం కంపెనీలకు వ్యవస్థాపకులు, సీనియర్‌ ప్రతినిధులు, ఛైర్మన్లుగా వలసదారులే ఉన్నారు. నైపుణ్యాలను గుర్తించి మౌలిక వసతులు, వనరులను అమెరికా కల్పిస్తోంది. పెట్టుబడులకు అదే ప్రధాన మార్గం. ప్రతి పరిశ్రమ టెక్నాలజీపైనే ఆధారపడి నడుస్తోంది. వినియోగదారులు సైతం టెక్నాలజీని ఆకళింపు చేసుకుంటున్నారనడానికి వాట్సాప్‌ ఒక ఉదాహరణ. స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్, స్పేస్‌ సిస్టమ్స్, సుస్థిరతకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
– బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సెయింట్‌ సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌

విశాఖకు అపార అవకాశాలు
ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖకు అపార అవకాశాలున్నాయి. విశాఖ డైనమిక్‌ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే ఐటీ రంగం మొత్తం విశాఖ వైపు పరుగులు తీస్తుంది. చైనా, జపాన్‌ పోటీని తట్టుకోవాలంటే వైజాగ్‌ లాంటి నగరాలను ఎంపిక చేసుకోవాల్సిందే. 
– అరవింద్‌కుమార్, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ 

విశాఖ వైపు బీపీవోలు..
దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా విశాఖ వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్లే సాధ్యమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఐటీ ఎగుమతులు సుమారు రూ.5 నుంచి రూ.6 వేల కోట్లు జరుగుతున్నాయి. ఇవి గణనీయంగా పెరగనున్నాయి. 
– శ్రీధర్‌ కొసరాజు, ఐటాప్‌ రాష్ట్ర అధ్యక్షుడు

20 సంస్థలకు ఎస్‌టీపీఐ అవార్డులు
ఐటీ, ఐటీ ఆధారిత రంగంలో దూసుకెళ్తున్న పలు సంస్థలకు ఎస్‌టీపీఐ అవార్డులను అందచేసింది. వివిధ విభాగాల్లో 20 సంస్థలకు సదస్సు సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. టాప్‌ ఐటీ, ఐటీఏపీ ఎక్స్‌పోర్టర్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ఏపీ అవార్డును చెగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సొంతం చేసుకుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top