భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్‌ 

Industrial Corridor Between Bhimili and Bhogapuram - Sakshi

డీపీఆర్‌ కాంట్రాక్టు దక్కించుకున్న కే అండ్‌ జే ప్రాజెక్ట్స్‌ 

ఎయిర్‌పోర్టు గేటు వరకు 20 కి.మీ 8 లేన్ల రహదారి అభివృద్ధి 

రహదారికి ఇరువైపులా పారిశ్రామిక, ఐటీ పార్కుల నిర్మాణం 

బీచ్‌ రిసార్ట్స్, ఆతిథ్య రంగంలో అవకాశాలపై నివేదిక 

సాక్షి, అమరావతి: భీమిలి నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు సుమారు 20 కి.మీ పారిశ్రామిక కారిడార్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసే సంస్థ ఎంపిక కూడా పూర్తయింది. డీపీఆర్‌ కాంట్రాక్టును నాగపూర్‌కు చెందిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్‌ దక్కించుకుంది. ఈ డీపీఆర్‌ తయారీకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఇన్‌క్యాప్‌) రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) బిడ్‌లను ఆహ్వానించగా మొత్తం నాలుగు సంస్థలు పోటీపడ్డాయి. ఇందులో అతి తక్కువ ధర కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచిన కేఅండ్‌జే ప్రాజెక్ట్స్‌ సంస్థను ఎంపిక చేసినట్లు ఇన్‌క్యాప్‌ వైస్‌ చైర్మన్, ఎండీ ఆర్‌.పవనమూర్తి తెలిపారు. సాంకేతిక అంశాల పరిశీలన అనంతరం పోటీపడ్డ నాలుగు సంస్థల్లో మూడు సంస్థలు.. ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, కేఅండ్‌జే ప్రాజెక్ట్స్, ట్రాన్స్‌లింక్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తుది బిడ్‌కు ఎంపికయ్యాయి. వీటిలో రూ. 41 లక్షల కోట్‌ చేసిన కేఅండ్‌జే సంస్థ ఎల్‌1గా నిలిచింది.   

డీపీఆర్‌ తయారీలో ప్రధాన అంశాలు.. 
► భీమిలి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రధాన గేటు వరకు ఉన్న 20 కి.మీ రహదారి అభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను పరిశీలించాలి. 
► మొత్తం 8 లేన్ల రహదారిలో తొలుత ఆరు లేన్లు, రెండు వైపుల సర్వీసు రోడ్డు నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలి. 
► ప్రస్తుతం ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రైవేటు భూమి ఎంత సేకరించాల్సి ఉంటుందన్న అంశాన్ని పరిశీలించాలి. 
► రహదారికి ఇరువైపుల తయారీ రంగానికి సంబంధించి పారిశ్రామిక పార్కులు, పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశాలను పరిశీలించాలి. 
► టూరిజం, హెల్త్, విద్య వంటి సేవా రంగాల పెట్టుబడులు, లాజిస్టిక్‌ హబ్స్‌ వ్యాపార అవకాశాలపై నివేదిక రూపొందించాలి. ప్రస్తుత ట్రాఫిక్, ఎయిర్‌పోర్టు అభివృద్ధి అయిన తర్వాత ఎంతమేర ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని అంచనా వేయాలి.  
► వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించాలి.  
► ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత మొత్తం అవసరమవుతుంది, దీనికి నిధులు ఎలా సేకరించాలి, లాభదాయకత వంటి అంశాలు పరిశీలించాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top