
సాక్షి, నెల్లూరు జిల్లా: భారతదేశ చరిత్రలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ‘ఉదయగిరి’ దుర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. అదే ఉదయగిరి పేరుతో భారత ప్రభుత్వం యుద్ధనౌకను రూపొందించి నావికా దళంలో మంగళవారం ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సా«ధించాలనే పట్టుదల, తపనతో విదేశీ వనరుల నుంచి చేర్చుకున్న చివర యుద్ధనౌక ఐఎన్‌ఎస్ తమల్.
ఇందులో భాగంగా రెండో తరం ఐఎన్‌ఎస్ ఉదయగిరి ప్రాజెక్టు 17ఏ కింద ఎఫ్–35 పేరుతో రూ.600 కోట్ల వ్యయంతో 6,670 టన్నుల సామర్థ్యం గల నీలి నీటిపై పనిచేసే విధంగా స్టెల్త్ ఫ్రిగేట్‌ను రూపొందించారు. ఇందులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ ప్రెసిషన్ స్ట్రెక్ క్రూయిజ్ క్షిపణులతో సహా అధునాతన సెన్సార్ల వ్యవస్థ, ఆయుధాలు ఉంటాయి. రష్యా, భారత్ వ్యుహాత్మక సహకారంతో రూపొందించిన 51వ యుద్ధనౌక ఇది.
ఇంతటి ప్రాముఖ్యత గల యుద్ధనౌకను ఉదయగిరి పేరుతో రూపొందించడంపై జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం గల ఉదయగిరి దుర్గం కేంద్రంగా పల్లవులు, చోళులు, చాణుక్యులు, గజపతులు, విజయనగర రాజులు, ముస్లింలు, ఆంగ్లేయులు పాలించారు. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఉదయగిరి కేంద్రంగా పాలించిన చరిత్ర ఉంది.