నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా... | Indian Army Jawan From Andhra Pradesh Martyred In Pakistani Shelling At LOC | Sakshi
Sakshi News home page

నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా...

May 10 2025 8:30 AM | Updated on May 10 2025 10:52 AM

Indian Army Jawan From Andhra Pradesh Martyred In Pakistani Shelling At LOC

దేశ సేవలో అమరుడైన మురళీ నాయక్‌  

కన్నీటిసంద్రమైన స్వగ్రామం కల్లితండా 

అతని జ్ఞాపకాలు తలచుకుని రోదిస్తున్న స్నేహితులు 

ఘన నివాళులర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు

పాకిస్తాన్‌తో జరుగుతున్న పోరులో అమరుడైన ఆర్మీ జవాన్‌ మురళీనాయక్‌ను తలచుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా బోరున విలపిస్తోంది. అతని స్వగ్రామం కల్లితండా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. జమ్మూకశ్మీర్‌లో శత్రుమూకలను తుదముట్టిస్తూ మురళీనాయక్‌ వీరమరణం పొందిన వార్త శుక్రవారం ఉదయం 9 గంటలకు తెలియగానే ఉమ్మడి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతోపాటు కుటుంబీకులు, సన్నిహితులు, స్నేహితులు మురళీనాయక్‌తో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అధికార యంత్రాంగంతోపాటు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు కల్లితండాకు వెళ్లి మురళీనాయక్‌ చిత్రపటం వద్ద  నివాళులర్పించారు. తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

కల్లితండా.. కన్నీటి సంద్రం

 అమరుడైన బిడ్డను తలచుకుని         

కన్నీరుమున్నీరైన తండావాసులు  

గోరంట్ల: పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో శత్రుమూకలను తరిమికొడుతూ వీరోచిత పోరాటం చేసిన మురళీనాయక్‌ అమరుడయ్యారన్న విషయం తెలియగానే అతని స్వగ్రామం గోరంట్ల మండలంలోని కల్లితండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 150 ఇళ్లు మాత్రమే ఉన్న     తండాలో అందరూ గిరిజనులే. శుక్రవారం ఉదయం మురళీ నాయక్‌ వీరమరణం గురించి  తెలియగానే తండావాసులంతా మురళీనాయక్‌ స్వగృహానికి చేరుకున్నారు.  తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌లను ఓదార్చారు. మురళీనాయక్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని పొగిలిపొగిలి ఏడ్చారు. గ్రామంలో చిన్నాపెద్ద తేడాలేకుండా అందరితో కలసిమెలసి ఉండేవాడని, అలాంటి బిడ్డ దేశం కోసం శత్రువుల చేతిలో     అసువులుబాయడంతో వారంతా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచే దేశభక్తి     మెండుగా ఉన్న మురళీ నాయక్‌...చాలా పట్టుదల గలవాడన్నారు. తాను అనుకున్నట్లే ఆర్మీలో చేరి దేశ సేవలో అమరుడయ్యారని విలపించారు. దేశం కోసం ప్రాణాలిచ్చిన గిరిజన ముద్దుబిడ్డ మురళీనాయక్‌ విగ్రహాన్ని మండల కేంద్రమైన గోరంట్లలో ఏర్పాటు చేయాలని అఖిల భారత బంజారా      సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు కోరారు.  

సలాం సైనిక
సైన్యంలో చేరాలన్న కలను నెరవేర్చుకున్నావ్‌ 
పాతికేళ్లకే జీవితాన్ని దేశానికి అంకితమిచ్చావ్‌ 
అక్కచెల్లెమ్మల నుదుటి సిందూరం చెరిపిన..
ఉగ్రమూకలకు బదులు చెప్పావ్‌ 
దేశానికి కవచంలా నిలబడి వీరోచిత పోరాటం చేశావ్‌ 
శత్రుసేనలను చెండాడుతూ సరిహద్దులో సగర్వంగా నిలిచావ్‌ 
మాతృభూమి కోసం చివరి నెత్తురుబోట్టునూ చిందించావ్‌ 
సలాం సైనిక.. 
నీ త్యాగం మరువం.. నీ పోరాటం వృథా కానివ్వం 
నీ రక్తాన్నే సిరాగా రాసిన చరితను వెయ్యేళ్లు చదువుకుంటాం 
మువ్వన్నెల పతాకమై ఎగిరిన నీ ధైర్యం సాక్షిగా చెబుతున్నాం 
ఆ పా(పి)కిస్తాన్‌ గాళ్లకు మరణశాసనం రాస్తాం 
యుద్ధమంటే పోరాటం కాదని..మాతృభూమిపై  ప్రేమని చాటిచెబుతాం 
జీవన రవళిలా ‘మురళి’ గానం చేస్తూనే ఉంటాం 
సలాం సైనిక... సలాం  

సోమందేపల్లిలో విద్యాభ్యాసం  
సోమందేపల్లి: వీర మరణం పొందిన మురళీ నాయక్‌ పదో తరగతి వరకు సోమందేపల్లిలోని విజ్ఞాన్‌ పాఠశాలలో చదువుకున్నారు. తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్‌ జీవనోపాధి కోసం ముంబయికి వెళ్లగా.. మురళీ నాయక్‌ సోమందేపల్లి మండలం నాగినాయిన చెరువు తండాలో అమ్మమ్మ శాంతి బాయి వద్ద ఉంటూ సోమందేపల్లిలోని విజ్ఞాన్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో చదివారు. 2016–17 టెన్త్‌ బ్యాచ్‌కు చెందిన మురళీ నాయక్‌ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. మురళీ నాయక్‌ మృతి విషయం తెలుసుకున్న పాఠశాల కరస్పాండెంట్‌ మల్లికార్జునతో పాటు అతని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమతో గడిపిన జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. చదువుతోపాటు క్రీడల్లోనూ మురళీనాయక్‌ రాణించేవాడన్నారు. తమ తండా యువకుడు దేశం కోసం ప్రాణాలరి్పంచడం గర్వంగా ఉందని నాగినాయనిచెరువు తండా సర్పంచ్‌ అంజినాయక్, గ్రామస్తులు చెబుతున్నారు.  

నమ్మలేకపోతున్నాం 
మురళీనాయక్‌ దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గర్వంగా ఉంది. కానీ పాతికేళ్లు కూడా లేని బిడ్డకు అప్పుడే నిండు నూరేళ్లు నిండాయంటే నమ్మలేకపోతున్నాం. ఏకైక సంతానాన్ని పోగొట్టుకున్న అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అతని  వీరోచిత పోరాటం వృథా కాదని భావిస్తున్నాం.  
– గోవింద నాయక్, కల్లితండా

దేశభక్తి ఎక్కువ 
మురళీ నాయక్‌ చాలామంచి అబ్బాయి. చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువ.  ఎప్పుడూ సైన్యంలో పనిచేయాలని చెప్పేవాడు. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా సైన్యంలోనే చేరాడు. నిరుపేద కుటుంబంలో పుట్టి దేశం కోసం ప్రాణాలు అర్పించి చరిత్రలో మిగిలిపోయాడు.  
– చాంప్లానాయక్, కల్లితండా

సైన్యంలో ఒక్కరోజున్నా చాలు 
నాకు ఏ ఉద్యోగం వద్దు... ఎంత కష్టమైనా ఆర్మీలోకే పోతా. బోర్డర్‌లో పనిచేయడం నా కల. ఒక్కరోజు పనిచేసినా చాలు. దేశం కోసం చావనైనా చస్తా. నా శవంపై భారత జెండా కప్పాలి.  
– స్నేహితులు, సన్నిహితులతో మురళీనాయక్‌ చెప్పిన మాటలివీ..

దేశభక్తి ఎక్కువగా ఉండేది  
మురళి నాయక్‌ నాకు మంచి మిత్రుడు. చాలా దేశభక్తి ఉండేది. పోలీసు లేదా ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని తపన ఉండేది. వీర మరణం పొందడం గర్వకారణంగా ఉంది. మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధ కల్గిస్తోంది. 
– చిరంజీవి, సోమందేపల్లి

క్రమశిక్షణతో చదివేవాడు 
మురళీ నాయక్‌ పదో తరగతి వరకూ మా పాఠశాలలో చదివాడు. చాలా క్రమశిక్షణతో చదువుకునే వాడు. ఎటువంటి వివాదాలు లేని విద్యారి్ధ, దేశ భక్తి కూడా ఎక్కువగా ఉండేది. మా పాఠశాలలో చదివి దేశం కోసం ప్రాణాలు అరి్పంచడం గర్వంగా ఉంది.           
– మల్లికార్జున, కరస్పాండెంట్‌ , విజ్ఞాన్‌ స్కూల్, సోమందేపల్లి 


 

Advertisement
 
Advertisement
Advertisement