కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్ | India is the center of the global AI tech market | Sakshi
Sakshi News home page

కృత్రిమ మేధ.. కేరాఫ్ భారత్

Sep 20 2024 5:47 AM | Updated on Sep 20 2024 5:47 AM

India is the center of the global AI tech market

ప్రపంచ ఏఐ టెక్‌ మార్కెట్‌కు కేంద్రంగా భారత్‌

వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకటి ఏఐతో ముడిపడిందే.. 

స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీ నివేదిక ప్రకారం పెట్టుబడుల ఆకర్షణలో ఐదో స్థానంలో భారత్‌ 

2022లో 3.24 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 

దేశంలో 10 వేల జీపీయూ ఏఐ ఇన్‌ఫ్రాలో పెట్టుబడులకు అవకాశం 

ఏఐ టెక్నాలజీకి ఊపునిచ్చిన ఇండియా ఏఐ–2024 సమ్మిట్‌ 

పెరుగుతున్న స్టార్టప్స్, మల్టీ నేషనల్‌ కంపెనీల పెట్టుబడులు 

‘డిజిటల్‌ ఇండియా, నేషనల్‌ ఏఐ స్ట్రాటజీ’ పాలసీలతో కేంద్రం ప్రోత్సాహం

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ రంగంలో అపార అవకాశాలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ప్రపంచాన్ని చాలా వేగంగా మారుస్తోంది. మనిషిలా ఆలోచించి నేర్చుకోవడమే కాదు.. మనిషిలానే తర్కించడం, కొత్త అర్థాన్ని కనుక్కోవడం, అనుభవం నుంచి నేర్చుకోవడం, సామర్థ్యం పెంచుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అలుపు, విరామమన్నది లేకుండా పనిచేసే ఈ టెక్నాలజీ మనిషి సృష్టించిన మరో అద్భుతం. 

పంటలు ఎలా పండిస్తే లాభమో చెబుతుంది. పిల్లలకు లెక్కలు (మ్యాథమెటిక్స్‌) సులభంగా నేర్పిస్తుంది. మన రహదారుల వెంట భద్రతను కట్టుదిట్టం చేస్తుంది. అమెరికా వంటి పెద్ద దేశాల్లోనే కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో, వినియోగంలో భారతదేశం కూడా దూసుకెళుతోంది.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం అన్ని రంగాల్లోనూ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలోని కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని కృత్రిమ మేధతోనే నిర్వహిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది 55 శాతానికి పెరుగుతుందని అంచనా.  చాలా రంగాలు 75 శాతం పైగా కార్యకలాపాలు ఏఐ సాయంతోనే నిర్వహిస్తాయని చెబుతున్నారు. ఇంటి అవసరాల నుంచి పంట పండించడం వరకు ఏఐ వినియోగం కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్‌లో ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసే ఏఐ రంగంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందుతున్న దశలో ఉంది. 

అనేక రంగాలు ఇప్పుడిప్పుడే ఏఐ సామర్థ్యాన్ని వినియోగించుకునే మార్గాలను అన్వేషించడం ప్రారంభించాయి. రోబోటిక్స్, మెషిన్‌ లెరి్నంగ్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ వంటి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టెక్నాలజీ ఫ్లాట్‌ఫారాలు రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.   – సాక్షి, అమరావతి

పెరుగుతున్న వినియోగం.. అవగాహన 
ఓ పక్క ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయంతో సహా అనేక పరిశ్రమలలో ఏఐ ఉపయోగిస్తుంటే.. మరో పక్క స్కూల్‌ స్థాయి నుంచి సాధారణ ప్రజల వరకు ఈ సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. ఇంకో వైపు భారత ప్రభుత్వం కనీసం 10,000 గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూ­నిట్లు (జీపీయూ) ఉన్న ఏఐ కంప్యూటింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెడుతుందని ఇటీవల జరిగిన గ్లోబల్‌ ఇండియా ఏఐ సమ్మిట్‌–2024లో ప్రకటించింది.

గతేడాది ఏప్రిల్‌లో స్టాన్‌ ఫోర్డ్‌ యూనివర్సిటీ విడుదల చేసిన ‘వార్షిక ఏఐ ఇండెక్స్‌’ ప్రకారం 2022లో ఏఐ ఆధారిత ఉత్పత్తులు, సేవ­లు అందించే స్టార్టప్‌లు 3.24 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని.. దక్షిణ కొరియా, జర్మనీ, కెనడా, ఆ్రస్టేలియా వంటి దేశా­ల­ను సైతం అధిగమించాయని పేర్కొంది. మనకంటే ముందు యూ­ఎస్, చైనా, యూకే, ఇజ్రాయిల్‌ మాత్రమే ఉన్నట్టు వివరించింది. భారత­దేశంలోని ఏఐ స్టార్టప్‌లు 2013 నుంచి 2022 వరకు మొత్తం 7.73 బిలియన్‌ డాలర్లు పొందగా, కేవలం 2022 ఏడాదిలోనే దాదాపు 40 శాతం పెట్టుబడులు పెరిగాయి. 

2028 నాటికి ఇది 20 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా. ఈ రంగానికి  ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రమే బాధ్యత తీసుకుంటుంది. ఏఐ పరిశోధకులు, కంపెనీలను ప్రోత్సహించేందుకు త్వరలో ఏఐ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను స్థాపించనున్నారు. దీంతో పాటు ఏఐ స్కిల్‌ డెవలప్‌మెంట్, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను కూడా రూపొ­ం­దించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రారంభ దశలో ఏఐ, డీప్‌ టెక్నాలజీకి అవసర­మైన నిధులను కేంద్రం అందించనుంది. దీని ద్వారా టెక్‌ నిపుణులకు భారీ డిమాండ్‌ ఏర్పడుతుందని అంచనా.  

బలమైన జాబ్‌ మార్కెట్‌ ఇలా
» గ్లోబల్‌ టెక్నాలజీ హబ్‌గా మన దేశ ప్రాధాన్యం పెరుగుతుందన్నది జగమెరిగిన సత్యం. అందుకు తగ్గట్టే దేశంలో కృత్రిమ మేధ (ఏఐ) ఉద్యోగ మార్కెట్‌ వృద్ధి చెందుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇందులో స్టార్టప్స్‌తో పాటు బహుళ జాతి కంపెనీల్లో ఏఐ టెక్‌ నిపుణులకు అవకాశాలు భారీగా ఉన్నాయి.  

»  మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్, రోబోటిక్స్‌ వంటి ఏఐ నైపుణ్యాలకు అధిక డిమాండ్‌ ఉంది. ఈ డిమాండ్‌ వల్ల తాజా గ్రాడ్యుయేట్లతో పాటు అనుభవజ్ఞులైన నిపుణులకు ఈ డైనమిక్‌ రంగంలో అవకాశాలు పెరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ప్రతి ఐదు ఉద్యోగాలలో ఒకటి కచ్చితంగా ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెరి్నంగ్‌ రంగాలకు చెందినదై ఉంటుందని చెబుతున్నారు.  

»  ఈ క్రమంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాధారణ కంప్యూటర్‌ కోర్సుల కంటే టెక్‌ రంగంలో కఠినమైన సమస్యలను పరిష్కరించడంలో సరికొత్త అంశాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగంలో పరిశోధన–ఆవిష్కరణలు, విద్యావేత్తలు– పరిశ్రమల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కేంద్ర ప్రభు­త్వం బలమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ‘డిజిటల్‌ ఇండియా, నేషనల్‌ ఏఐ స్ట్రాటజీ’ వంటి ప్రోగ్రామ్‌లను అందుబాటులోకి తెచ్చింది.
నమ్మశక్యం కాని అద్భుతాలు 

»  భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని మార్చగల శక్తి ఏఐకి ఉందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమీప కాలంలోనే ఈ టెక్నాలజీ కీలకం కానుందంటున్నారు.  

»  వ్యవసాయంలో వాతావరణ మార్పులను అంచనా వేసి, ఏ సమయంలో ఏ పంట వేయాలో.. పంటల సస్యరక్షణ, దిగుబడులను పెంచడంలో రైతులకు నేరుగా సహాయం చేయగల సామర్థ్యం దీనికుంది.  

»  ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు కావాల్సిన ఏఐ టెక్నాలజీ సహకారం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలో పెట్టుబడులు, నిపుణుల నియామకం కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఏఐ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు స్థాపించనున్నారు. అంటే ఈ టెక్నాలజీపై శిక్షణ నుంచి కొత్త సృష్టి వరకు అనేక విభాగాలకు భారత్‌ అంతర్జాతీయ మార్కెట్‌కు కేంద్రం కానుంది.  

»  కృత్రిమ మేధస్సు (ఏఐ)ను ఉపయోగించి నమ్మశక్యం కాని అద్భుతాలు ఆవిష్కరించేందుకు భారతదేశానికి చాలా మంచి అవకాశం ఉందని, ఇది మునుపటి కంటే మరింత అభివృద్ధి చెందడానికి, ఇంటెలిజెన్స్‌ భారత్‌ను సృష్టించడానికి దోహదం చేస్తుందని నిపుణులు      చెబుతున్నారు.  

ఏఐ టెక్నాలజీ వినియోగం శాతాల్లో
68 బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌
65 టెక్‌ పరిశ్రమ
52 ఫార్మా అండ్‌ హెల్త్‌కేర్‌
43 ఎఫ్‌ఎంసీజీ అండ్‌ రిటైల్‌    
28 తయారీ రంగం
22 మౌలిక వసతులు, రవాణ
12 మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
68 బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్విసెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement