కొత్త బంగారు లోకం | Increasing demand for 14 and 18 carat gold jewellery | Sakshi
Sakshi News home page

కొత్త బంగారు లోకం

Jan 29 2023 5:27 AM | Updated on Jan 29 2023 6:18 AM

Increasing demand for 14 and 18 carat gold jewellery - Sakshi

సాక్షి, అమరావతి: నిన్నా మొన్నటి వరకు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల కొనుగోలుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రజల అభిరుచిలో గణనీయమైన మార్పు వచ్చింది. ప్రస్తుతం 14 –18 క్యారెట్ల బంగారంతో చేసిన ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే ప్రజలు ఇలా నిర్ణయం మార్చుకున్నారని స్పష్టమవుతోంది.

ఈ నేపథ్యంలో వారి బడ్జెట్‌కు తగినట్టుగా తక్కువ క్యారెట్లతోనే ఆభరణాలు తయారు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 2021లో దేశ వ్యాప్తంగా 611 టన్నుల బంగారు ఆభరణాలు అమ్ముడైనట్టు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో 25 శాతం భారతీయ పెళ్లి కూతుళ్ల కోసమే కొంటున్నట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు యువత మోడ్రన్‌ దుస్తులు ఎక్కువగా ధరిస్తుండటంతో వాటికి అనుగుణంగా ఆభరణాలను తయారు చేస్తున్నట్టు దేశీయ బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికీ బంగారం అమ్మకాల్లో 80 శాతం 22 క్యారెట్ల ఆభరణాలే ఉన్నప్పటికీ.. తక్కువ క్యారెట్ల ఆభరణాలకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతున్నట్టు పేర్కొంటున్నారు.

గాజులు హారాలదే హవా
దేశంలో అమ్ముడవుతున్న బంగారు ఆభరణాల్లో గాజులు, హారాల వాటాయే అత్యధికం. మొత్తం అమ్మకాల్లో 30–40 శాతం వాటా గాజులు ఆక్రమించగా.. హారాల వాటా 30–40 శాతం ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో నెక్లెస్‌లు 15–20 శాతం వాటా ఉంటే.. చెవిదిద్దులు, చేతి ఉంగరాల అమ్మకాలు 5–15 శాతం చొప్పున ఉంటున్నాయి. ఒక్కొక్క నెక్లెస్‌ కోసం సగటున 30 నుంచి 60 గ్రాములను వినియోగిస్తుంటే.. గాజుల కోసం 10 నుంచి 15 గ్రాములు, చెయిన్ల కోసం 10 నుంచి 20 గ్రాములు, ఉంగరాలు, చెవిదిద్దుల కోసం 3నుంచి 8 గ్రాముల వరకు బంగారాన్ని వినియోగిస్తున్నారు.

పెళ్లి ఆభరణాల వాటా 55 శాతం
దేశీయ ఆభరణాల అమ్మకాల్లో వివాహాల సందర్భంగా వినియోగించే ఆభరణాల వాటా 55 శాతం వరకు ఉంది. దేశంలో ఏటా సగటున 1.10 కోట్ల నుంచి 1.30 కోట్ల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. ఆ తర్వాత పంటలు చేతికి వచ్చినప్పుడు, అక్షయ తృతీయ, ధన్‌తేరాస్‌ వంటి పర్వదినాల్లో బంగారం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో 60 టన్నుల బంగారం అమ్ముడవుతోంది. కాగా.. పట్టణ ప్రజలతో పోలిస్తే.. గ్రామీణులే అత్యధికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడైంది. మొత్తం బంగారం అమ్మకాల్లో 58 శాతం గ్రామీణ మధ్యతరగతి ప్రజలే కొంటున్నారు.

రోజువారీ ధరించే నగల కొనుగోళ్ల వాటా 35 నుంచి 40 శాతం ఉండగా..  ఫ్యాషన్‌ జ్యూవెలరీ వాటా 5–10 శాతం వరకు ఉంది. దక్షిణాది ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టెంపుల్‌ జ్యూవెలరీ, కుందన్‌ వంటి భారీ మోడల్స్‌ను ఇప్పుడు ఉత్తరాది వారు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నట్టు సర్వే వెల్లడించింది. పెళ్లిలకు సగటున 35 నుంచి 250 గ్రాముల బరువుండే ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. రోజువారీ ధరించేందుకు 5 నుంచి 30 గ్రాముల బరువుండే ఆభరణాలను కొంటున్నారు. ఫ్యాషన్‌ జ్యూవెలరీ అయితే.. 5 నుంచి 20 గ్రాములలోపు వినియోగిస్తున్నారని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement