Hottest Summer: ‘రికార్డు’ భగభగలు

Increased temperatures across Andhra Pradesh - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

అత్యధికంగా కృష్ణా జిల్లాలో 43.1 డిగ్రీలు

విశాఖలో మే నెలలో 43 ఏళ్ల ఎండ రికార్డు బద్దలు

బుధవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత 

తేమను తీసుకెళ్లిన యాస్‌ తుపాను

రాజస్థాన్‌ నుంచి రాష్ట్రంపైకి పొడిగాలులు

జూన్‌ 5 నాటికి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: గాలులు, వర్షాలతో తూర్పు తీరాన్ని వణికించిన యాస్‌ తుపాను.. మన రాష్ట్రంలో వ్యతిరేక ప్రభావం చూపింది. ఎండ భగభగలాడేలా చేసింది. తుపాను తేమగాలుల్ని తీసుకుపోవడంతో రాజస్థాన్‌లోని థార్‌ ఎడారి ప్రాంతం నుంచి పొడిగాలులు నేరుగా మన రాష్ట్రం వైపు వస్తున్నాయి. ఫలితంగా బుధవారం భానుడు ప్రతాపం చూపించాడు. కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా అల్లూరులో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో మే నెలలో 43 ఏళ్ల తర్వాత.. 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1978 మే 19న విశాఖ నగరంలో నమోదైన 42 డిగ్రీలు మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉంది. బుధవారం నగరంలో 42.3 డిగ్రీలు నమోదైంది. 

ఈనెల 30 వరకు వడగాలులు, ఎండలు
ఈనెల 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 36 మండలాలు, కృష్ణాలోని 15, తూర్పు గోదావరిలోని 12, విజయనగరంలోని 2, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున 68 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాలో 28, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 14, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో మండలం చొప్పున మొత్తం 65 మండలాల్లో వడగాలులు వీస్తాయని చెప్పారు. కోస్తాలోని పలు ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈనెల మే 30 తర్వాత తేమగాలులు తెలంగాణ మీదుగా రాష్ట్రం వైపు రావడంతో ఎండల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుందని, వర్షాలు మొదలవుతాయని తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గురువారం సాయంత్రానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి.

జూన్‌ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వచ్చే 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్‌ కన్నబాబు ఒక ప్రకటనలో కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top