భారీగా పెరిగిన ‘బియ్యం’ లబ్ధిదారులు

Increased Number Of Family Members In Rice Cards - Sakshi

బియ్యం కార్డుల్లో పెరిగిన కుటుంబసభ్యుల సంఖ్య

గతంతో పోలిస్తే కార్డులు తీసుకునేందుకు అర్హతలనూ సడలించారు

వచ్చేనెల నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం

బియ్యం కార్డులతో ఇతర పథకాలకు ముడిపెట్టలేదు

సాక్షి, అమరావతి: అర్హులందరికీ రేషన్‌ బియ్యం అందాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. బియ్యం కార్డుల్లో కుటుంబసభ్యుల సంఖ్య (యూనిట్లు) పెరిగింది. గతంతో పోలిస్తే 2.10 లక్షల మందికిపైగా బియ్యం కార్డుల్లో కొత్తగా నమోదయ్యారు. పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానంలో బియ్యం కార్డులను అమల్లోకి తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ పంపిణీ చేస్తున్న బియ్యం వండుకుని తినేందుకు వీలులేని పరిస్థితుల్లో ఎక్కువమంది వాటిని విక్రయిస్తున్నారు. తినగలిగే నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తే పేదలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని భావించిన ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. వచ్చేనెల నుంచి లబ్ధిదారులకు వారి ఇళ్లవద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరి బియ్యం కార్డులతో పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. 

వైఎస్సార్‌ నవశకంతో అర్హుల గుర్తింపు ఇలా...
వైఎస్సార్‌ నవశకం కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పదినెలల కిందట బియ్యం కార్డుకు అర్హులను గుర్తించింది. ప్రతి 50 ఇళ్లకు ఉన్న గ్రామ, వార్డు వలంటీరు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించారు. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు 1,47,32,990 ఉంటే.. అందులో సుమారు 10 లక్షలమంది కార్డుదారులు అసలు బియ్యం తీసుకోవడంలేదని అప్పట్లో తేలింది. మరికొందరు అనర్హులుగా తేలారు. వలంటీరు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి ఇచ్చి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఈ మేరకు సిద్ధంచేసిన జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అర్హులు, అనర్హుల జాబితాను ప్రజల ముందే ఉంచి సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు. ఒకవేళ అర్హత ఉండి పేరు లేకపోతే ఎవరికి దరఖాస్తు చేయాలనే వివరాలు కూడా సచివాలయాల్లో ప్రదర్శించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు.

అర్హత ఉంటే ఇంటికే బియ్యం కార్డు
అర్హతే ప్రమాణంగా ప్రభుత్వం బియ్యం కార్డులు మంజూరు చేస్తోంది. అర్హత ఉన్నవారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పదిరోజుల్లోగా బియ్యం కార్డు వారి ఇంటికే వస్తోంది. అర్హులందరికీ కార్డులు ఇవ్వాల్సిందేనని సీఎం  వైఎస్‌ జగన్‌ అధికారులకు పలుమార్లు స్పష్టం చేశారు.  

పెరిగిన యూనిట్లు
నవశకం కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించినప్పుడు 1,47,32,990 రేషన్‌ కార్డులున్నాయి. వాటిలో 4,20,83,190 మంది కుటుంబసభ్యుల పేర్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,44,26,595 బియ్యం కార్డులుంటే వాటిలో 4,22,93,346 మంది కుటుంబసభ్యుల (యూనిట్లు) పేర్లు నమోదై ఉన్నాయి. ఈ లెక్కన కార్డుల సంఖ్య స్వల్పంగా తగ్గినా 2,10,156 మంది కుటుంబసభ్యుల సంఖ్య పెరిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top