
యువతలో అధికమైన గుండె సమస్యలు
ఆహార అలవాట్లు, వ్యసనాలతోనే సమస్యలంటున్న వైద్య నిపుణులు
మెరుగైన జీవన విధానంపై దృష్టి సారించాలని సూచనలు
గత నెలలో అనంతపురం రూరల్ మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు గుండె నొప్పిగా ఉందంటూ అనంత పురంలోని సర్వజనాస్పత్రికి వచ్చాడు. వైద్యులు పరీక్షిస్తున్న సమయంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.
అనంతపురం నగరపాలక సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి ఇటీవల అమరావతికి వెళ్లారు. మార్గమధ్యంలో ఉన్నఫళంగా గుండె నొప్పి వచ్చింది. తోటి సిబ్బంది హుటాహుటిన కర్నూలు జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరి్పంచగా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇటీవల యువతలో గుండెపోట్లు పెరిగిపోయాయి.
అనంతపురం మెడికల్: నిండు నూరేళ్లు జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. వందేళ్లు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా జీవనం సాగించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో వందేళ్ల మాట పక్కన పెడితే 25 నుంచి 30 ఏళ్లకే యువత మరణిస్తుండడం కలచివేస్తోంది. ప్రధానంగా గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలో కోల్పోతుండడం కలవరపరుస్తోంది. చెట్టంత కొడుకు కళ్లముందే ప్రాణాలు విడుస్తుండడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా సగటున 25 వేల మందికిపైగా గుండెపోట్లకు గురవుతుండడం గమనార్హం.
2019–20లో 4,660, 2020–21లో 5,107, 2021–22లో 6,637, 2022–23లో 7,909, 2023–24లో 10,274, 2024–25లో 9,754, 2025లో 7 వేల వరకు (ఇప్పటి వరకు) గుండె సంబంధిత శస్త్రచికిత్సలు జరిగాయి.ఏటా ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకం (ఆరోగ్య శ్రీ)లో భాగంగా 30 శాతానికి పైగా గుండె జబ్బులకే వ్యయమవుతోంది. రూ.25 కోట్లకు పైగానే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
విద్యార్థి దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా రోజూ కనీసం అరగంట వాకింగ్, వ్యాయామం చేయాలంటున్నారు. ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. జంక్ ఫుడ్‌తో ఓబెసిటీ, గ్యాస్రై్టటీస్ తదితర సమస్యలు తలెత్తుతాయంటున్నారు. వారానికి 150 నిమిషాలు కనీస నడక మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, 40 ఏళ్లు పైబడిన వారు తప్పకుండా బీపీ, కొలె్రస్టాల్, షుగర్, టెస్టులు చేయించుకుని మందులు వాడితే గుండెపోటును నియంత్రించవచ్చంటున్నారు.
వ్యసనాలతోనే సమస్య..
వ్యసనాలకు బానిసలు కావడం,వ్యాయామం, యోగా తదితర వాటికి దూరంగా ఉండడం తదితర కారణాలతో చిన్నవయసులోనే గుండె సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో యువత పార్టీల పేరుతో ఇష్టానుసారంగా మద్యం తీసుకుంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన ధూమపానాన్ని సేవిస్తున్నారు. దీనికి తోడు ఉరుకుల పరుగుల జీవితంలో బిజీగా ఉంటూ మానసిక ఒత్తిడికి లోనవుతూ హైపర్‌టెన్షన్, మధుమేహం బారిన పడుతున్నారు.
యోగాతో సత్ఫలితాలు
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ఆహార అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, నిద్రలేమి తదితర కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. గుండె పోటు, బీపీ, మధుమేహం తదితర సమస్యలు తెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయాలి. యోగా బాగా ఉపయోగపడుతుంది. నిత్యం యోగా చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు. – సురేష్ ఈశాపతి, యోగా గురువు, అనంతపురం
వైద్య పరీక్షలు చేయించుకోవాలి
జంక్ ఫుడ్, పొగ తాగడం, వ్యాయామం లేకపోవడంతో యువత మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం చేయాలి. వంశపారంపర్యంగా కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత రోజుల్లో 12 మందిని పరీక్షిస్తే అందులో ముగ్గురికి కచ్చితంగా బీపీ సమస్య కని్పస్తోంది.ఈ పరిస్థితుల్లో 40 ఏళ్లు దాటిన వారందరూ తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – సుభాష్ చంద్రబోస్, అసోసియేట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి