
రాష్ట్ర వ్యాప్తంగా ఇష్టానుసారంగా ఇసుక అక్రమ తవ్వకాలు
అధిక లోడు, నిబంధనలు పాటించకుండా రవాణా
ఫలితంగా ఇసుక లారీలు, టిప్పర్ల వల్ల నిత్యం ప్రమాదాలు
రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే దందా
ఠంచనుగా చినబాబుకు కమీషన్లు..
గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదులను చెరబట్టిన వైనం
చంద్రబాబు ఇంటి వెనుక సైతం అడ్డగోలుగా తవ్వకాలు
ఉచిత ఇసుక బూటకం.. గత ప్రభుత్వంలో కంటే ధర అధికం
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: ఉచిత ఇసుక ముసుగులో రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక దోపిడీ కూటమి పార్టీల నేతల జేబులు నింపుతూ సంతోషాన్నిస్తుండగా, ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా, అడ్డూ అదుపు లేకుండా, నిబంధనలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా జరుగుతున్న ఈ దోపిడీతో జనం అల్లాడిపోతున్నారు. అక్రమ రవాణా అదుపు తప్పుతుండటంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
నదులు, వాగులు, పొలాలను ఇష్టానుసారం కొల్లగొట్టి అధిక లోడుతో రోడ్లపై ఎలా పడితే అలా ఇసుకను రవాణా చేస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం వందలాది ఇసుక లారీలు గ్రామ స్థాయి రహదారుల నుంచి జాతీయ రహదారుల వరకు యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. అనుమతి లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపి, పర్మిట్లు కూడా సరిగా లేకుండా ఇసుక రవాణా చేస్తూ, అది కూడా రాంగ్ రూట్‌లో, ఎటు పడితే అటు ఈ వాహనాలు తిరుగుతున్నాయి.
అక్రమ ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వందలాది లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇంటికి సమీపంలో లింగాయపాలెం వద్ద నావిగేషన్ ఛానల్ ముసుగులో ఇసుకను అడ్డగోలుగా తవ్వి అక్రమంగా రవాణా చేస్తుండటం విస్తుగొలుపుతోంది.
అధికారంలోకి రావడంతోనే అక్రమాలు మొదలు
» 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఇసుక దందా మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చీ రావడంతోనే జగన్ ప్రభుత్వం వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 70కిపైగా రీచ్‌ల్లో నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకపై పడిన టీడీపీ నేతలు యథేచ్ఛగా అమ్మేసుకున్నారు.
» అనంతరం ఉచిత ఇసుక విధానం అని చెప్పి రీచ్‌లు, స్టాక్ యార్డుల్లో ధరల పట్టిక పెట్టి మరీ అమ్మారు. తవ్వకం ఛార్జీలు, లోడింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు అన్నీ కలిపి టన్ను ఇసుక రూ.1000 నుంచి రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. అన్ని జిల్లాల్లో ఇసుక రీచ్‌లను టెండర్ల విధానంలోనే టీడీపీ నేతలకు కట్టబెట్టి అధికారికంగానే ఇసుకను అమ్ముతున్నారు. పొరుగు రాష్ట్రాలకూ తరలిస్తున్నారు.
» ఎక్కడా ఇసుక ఉచితం అన్నదే లేదు. డబ్బు కడితేనే ఇసుక ఇస్తామని చెబుతున్నారు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో సైతం ఉచితంగా తీసుకెళ్లనివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్న ధరలు కన్నా ఇప్పుడు అధికంగా అమ్ముతుండడం విశేషం. బెజవాడలో 22 టన్నుల లారీ ఇసుక రూ. 40 వేల నుంచి రూ.50 వేలకు అమ్ముతున్నారు.
» గోదావరి, కృష్ణ, పెన్నా, చిత్రావతి, నాగావళి సహా అన్ని నదుల నుంచి ఇసుక అక్రమ రవాణా ఇష్టానుసారం చేస్తున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు సూచనలను లెక్కే చేయడం లేదు. కార్మికులతో తవ్వకాలు చేయాల్సివుండగా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి.
» అన్నిచోట్లా అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఇసుక దందా సాగుతోంది. కమీషన్లు చినబాబుకు ఠంచనుగా చేరిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇసుక విధానం వల్ల ఏటా రూ.750 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ ఆదాయం లేదు.. ప్రజలకు ఇసుక ఉచితమూ లేదు. పైగా గత ప్రభుత్వ హయాంలో కంటే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
ఇసుకాసురుల ధన దాహానికి నాడు 16 మంది రైతులు బలి
అది 2017.. టీడీపీ నాయకులు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో ఇసుకను రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అయితే నదిలోని ఇసుక తోడేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటకు సేద్యపు నీరు కొరత ఏర్పడుతోందని భావించి ఏర్పేడు మండలం మునగలపాళెం నుంచి సుమారు 50 మంది రైతులు, మహిళలు ఏర్పేడు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు సిద్ధమయ్యారు.

ఆ సమయంలోనే ఏర్పేడు పోలీస్ స్టేషన్‌కు అప్పటి జిల్లా ఎస్‌పీ జయలక్ష్మి వచ్చారని తెలుసుకుని ఆమెకు తమ గోడు విన్నవించుకునేందుకు వెళ్లారు. ఆమె కనీసం రైతులను కలవకుండా అక్కడే వారిని రోడ్డుపైనే నిరీక్షించేలా చేసి, బయటకు వచి్చ, వారితో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఓ ఇసుక లారీ రైతుల పైకి దూసుకొచ్చింది. ఈ ఘోరంలో 16 మంది రైతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఓ దినపత్రిక రిపోర్టర్ ఆరాసి బాలమురళి కూడా ఉన్నారు.
మరి కొంతమంది చేతులు, కాళ్లు కోల్పోయి జీవచ్ఛవాలుగా మారారు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ మునగలపాళెం చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే ఈ దురాగతానికి కారణమైన ప్రధాన సూత్రధారులు టీడీపీకి చెందిన ఏర్పేడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పేరం ధనంజయులునాయుడు, పేరం నాగరాజునాయుడు, చిరంజీవులు నాయుడు. ప్రస్తుతమూ టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు.
గోదాట్లో కలిసిపోతోన్న ప్రాణాలు
» టీడీపీ ఇసుకాసురుల దెబ్బకు గోదారమ్మ విలవిల్లాడుతోంది. అధికార కూటమి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ధనార్జనతో గోదావరి నదిని గుల్ల చేస్తున్నారు. పి.గన్నవరం, అయినవిల్లి మండలాల్లో దోపిడీ పరాకాష్టకు చేరింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం, కోటిపల్లి సరిహద్దులలో మాన్సాస్ ట్రస్టు భూముల్లోనూ ఇసుకదోపిడీ సాగుతోంది.

» టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సోదరుడు పృధ్వీరాజ్, మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అనుచరులు, జనసేన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అనుచరగణం ఇసుక అక్రమాలకు తెగబడుతున్నారు.
» ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో గుంతలు పడి పలువురు మృత్యువాత పడుతున్నారు. ముమ్మిడివరం మండలం శేరిల్లంక–సలాదివారిపాలెం మధ్య వృద్ద గౌతమిలో మే 26న ఒక శుభ కార్యక్రమానికి వచి్చన ఎనిమిది మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగి మృత్యువాత పడ్డారు.
» తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల–2, గాయిత్రి, కడియపులంక, తీపర్రు, పందలపర్రు,‡ పెండ్యాల, కొవ్వూరు ఇసుక ర్యాంపుల్లో నిషేధిత డ్రెడ్జింగ్ అడ్డగోలుగా సాగుతోంది. రోజుకు 600 లారీల ఇసుక
తరలుతోంది.
అంతటా అదే దందా
» ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యాప్తంగా ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు తెలంగాణాకు తరలిస్తున్నారు. లారీకి రూ.60 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ర్యాంపులకు వెళ్లే దారులు అధ్వానంగా మారడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

» ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రోజుకు వెయ్యికి పైగా ట్రాక్టర్లు, 100కు పైగా టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. రేయింబవళ్లు జేసీబీలతో తవ్వకాలు చేస్తున్నా అధికారులు అటు వైపు తొంగి చూడడం లేదు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది.
» శ్రీకాకుళం జిల్లాలో అక్రమార్కులకు ప్రభుత్వమే లైసెన్సు ఇచ్చినట్టుగా దందా నడుస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం కొనసాగుతోంది. ఆమదాలవలస మండలం కొత్తవలసలో ఇసుక తవ్వకాలు అడ్డుకున్నారని ఏకంగా గ్రామస్తులపైనే దాడి చేసి కొట్టారు. పొందూరు మండలంలో ఇసుక అక్రమాలు అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌పై టీడీపీ నాయకులు దాడికి యత్నించారు.
» రాయలసీమ జిల్లాలో అధికార కూటమి నేతల కనుసన్నల్లో ఇసుక దందా సాగుతోంది. అడ్డుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. చిత్రావతి, పెన్నా, పాపాఘ్ని, తుంగభద్ర తీరాల్లో కూటమి నేతలు అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.
టీడీపీ తోడేళ్ల దెబ్బకు పెన్నాకు గర్భశోకం
యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా
డీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం
ఇసుక మాఫియాకు టీడీపీ నేతలు సోమిరెడ్డి, ఆనం, ప్రశాంతి అండదండలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పెన్నమ్మ శోకిస్తోంది. అయినా జిల్లా అధికార యంత్రాంగానికి వినపడటం లేదు.. కనపడటం లేదు. ధనార్జనే ధ్యేయంగా టీడీపీ నేతలు అక్రమంగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో భవిష్యత్‌లో ప్రమాద ఘంటికలు మూగబోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో పెన్నా నదిపై నిర్మించిన నెల్లూరు, సంగం బ్యారేజీల భద్రత గాలిలో దీపంలా మారతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పెన్నా నదిని కుళ్ల»ొడిచి పగటి సమయాల్లో బహిరంగంగానే తరలిస్తూ దోపిడీ చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొంది ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పేదల ప్రాణాలు తీస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంగం, సూరాయపాళెం, పోతిరెడ్డిపాళెం.. మూడు డీసిల్టేషన్ పాయింట్లతో పాటు పల్లిపాడు, అప్పారావుపాళెంలో రెండు ఓపెన్ రీచ్‌లకు అనుమతులు ఇచ్చారు. పర్యావరణ అనుమతులు లేనందున నదుల్లో యంత్రాల ద్వారా ఇసుక లోడింగ్ విధానానికి అనుమతులు రాలేదు.
డీసిల్టేషన్ పాయింట్లలో దగ్గర నుంచి స్టాక్ పాయింట్ వద్దకు తెచి్చన ఇసుకను మాత్రమే లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. టన్నుకు రూ.250 వరకు ఖర్చవుతోంది. ఓపెన్ రీచ్‌ల్లో మాత్రం సెమీ మెకనైజ్డ్ పేరుతో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. కానీ పెన్నా నదిలోనే భారీ యంత్రాలు పెట్టి నదిని తోడేస్తూ ఇసుక దోపిడీ చేశారు. జిల్లాలో ఎన్జీటీ ఆదేశాల మేరకు అక్టోబర్ 15 వరకు పెన్నానదిలో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ అడ్డగోలుగా తవ్వకాలు, రవాణా సాగిస్తున్నారు.
అడుగడుగునా అక్రమాలు
» డీసిల్టేషన్ పాయింట్ల వద్ద మాయాజాలం చేస్తున్నారు. పగటి సమయాల్లో మాత్రం డంపింగ్ యార్డు వద్ద లోడింగ్ చూపుతారు. కొండల్లా ఇసుక దిబ్బలు పేరుకుపోతుంటాయి. కానీ లెక్కల్లో మాత్రం రోజువారీ 100 టన్నులే పోతోందని చూపుతారు. రాత్రి వేళల్లో లోడింగ్ చార్జీలు రూ.7 వేలు వంతున తీసుకుని నది నుంచే లోడింగ్ చేస్తున్నారు.
» సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అండతో సూరాయపాళెం, విరువూరులో.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో పీకేపాడు, సంగం.. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అండతో పోతిరెడ్డిపాళెంలో ఇసుక మాఫియా రెచి్చపోతోంది.
» పెన్నా పరీవాహక ప్రాంతంలో దాదాపు 18 ప్రాంతాల్లో పొర్లుకట్టలు ఉన్నాయి. వాటిని ధ్వంసం చేసి ఇసుక రవాణా సాగిస్తున్నారు..
» ప్రస్తుతం సోమశిల జలాలు విడుదల చేయడంతో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. వచ్చే
మాసం నుంచి వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉంది. సోమశిలకు వరదనీరు ప్రవాహం పెరిగితే నీరు నదిలోకి వదలాల్సి ఉంది. ఈ క్రమంలో పొర్లు కట్టలు తెగిపోవడంతో పలు గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉంది.
» అక్రమ రవాణా ద్వారా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన ఇసుక మాఫియా నేతలు సొంతంగా పెద్ద సంఖ్యలో టిప్పర్లు కొనుగోలు చేసి పోలీసు, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు.
» సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం విరువూరు ఓపెన్ ఇసుక రీచ్‌పై ఆంక్షలు ఉన్నప్పటికీ బిల్లులు ఇచ్చి మరీ ఇసుకను తరలిస్తుండటం విస్తుగొలుపుతోంది.