సోయగాల చేపలతో సిరులు

Huge Income For Colorful Fishes Andhra Pradesh - Sakshi

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి

పెట్టుబడికి మూడు రెట్లు ఆదాయం

పీఎంఎస్‌ఎస్‌వై కింద రూ.కోటిన్నర వరకు ఆర్థిక చేయూత

మహిళలకు 30 శాతం, ఇతరులకు 25 శాతం సబ్సిడీ  

సాక్షి, అమరావతి: రంగురంగుల చేపలు.. సోయగాల చేపలు సిరులు కురిపిస్తున్నాయి. ఒకప్పుడు ధనవంతుల ఇళ్లకే పరి­మితమైన ఈ అలంకార చేపలు.. ఇప్పుడు మధ్యతరగతి, సామా­న్య ప్రజల నివాసాల్లో కూడా కనువిందు చేస్తున్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా వీటికి గిరాకీ పెరిగింది. అంతర్జాతీయంగా ఏటా రూ.15 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంటే.. భారత్‌లో రూ.250 కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. దేశీ­యం­గా ఈ అలంకార చేపల ఉత్పత్తిలో పశ్చిమబెంగాల్, తమి­ళనాడు, మహారాష్ట్ర ముందు వరుసలో ఉన్నాయి.

ప్రపంచవ్యా­ప్తంగా 2,500కు పైగా రకాల అలంకార చేపలను ఉత్పత్తి చేస్తుం­టే.. మన దేశంలోని మంచి నీటిలో 375, ఉప్పు నీటిలో 165 రకాల చేపలను సాగు చేస్తున్నారు. ఏపీలో ఈ అలంకార చే­పల సాగుకు రాయలసీమ కేంద్రంగా ఉంది. ముఖ్యంగా క­ర్నూ­లు, నంద్యాల జిల్లాల్లో వీటి సాగు విస్తరిస్తోంది. కాకినాడ, విశాఖపట్నంలో కూడా పెద్ద యూనిట్లున్నాయి. ఇక్కడ ఏటా మూడు దఫాల్లో సాగు చేస్తూ.. ఒక్కో విడతలో 1.20 లక్షల నుంచి 1.50 లక్షల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.

భారీగా ఆదాయం..
300 చదరపు అడుగుల ట్యాంకులో 3–4 సెంటీమీటర్ల సైజున్న 600 నుంచి 800 పిల్లలను వేస్తే నెలకు అంగుళం సైజుకొస్తాయి. రకాల ఆధారంగా గరిష్టంగా 300 నుంచి 500 గ్రాముల వరకు పెరుగుతాయి. అంగుళం సైజుకొస్తే చాలు.. మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. నెలకు 13 వేల చేపల చొప్పున.. ఏటా లక్షకు పైనే పిల్లలు ఉత్పత్తి అవుతాయి. సాధారణ అలంకార చేప ధర రూ.10. కొన్ని రకాలైతే రూ.వందలు, రూ.వేలల్లో కూడా ఉంటాయి. రూ.3.40 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. 

రూ.కోటిన్నర వరకు చేయూత..
రాయలసీమతో పాటు ఉమ్మడి కృష్ణా, గోదావరి, విశాఖ జిల్లాలు అలంకార చేపల సాగుకు అనుకూలమని.. ఏటా కోటి చేపలు ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని నిఫుణులు అంచనా వేశారు. దీనిని ప్రోత్సహిస్తే కనీసం 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అలంకార చేపల సాగు యూనిట్లకు ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి పథకంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ స్కీమ్‌ కింద రూ.25 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు ఆర్థిక చేయూతనిస్తున్నారు. మహిళలకు 30 శాతం, ఇతరులకు 25 శాతం సబ్సిడీ అందిస్తున్నారు.

20 రకాలను ఉత్పత్తి చేస్తున్నాం.. 
1.25 ఎకరాల్లో రూ.93 లక్షలతో క్లస్టర్‌ యూనిట్‌ ఏర్పాటు చేశాం. బ్రూడర్, రేరింగ్, లార్వా యూనిట్లతో పాటు 100 
ట్యాంకులు, 100 అక్వేరియం యూనిట్లు పెట్టాం. 20 రకాల చేపల్ని ఉత్పత్తి చేస్తున్నాం. 
– ఆర్‌.అలోక్, జె.ధీరజ్, ఆనందజ్యోతి ఆర్నమెంటల్‌ ఫిషరీస్‌ ఫామ్, కర్నూలు

రూ.1.50 లక్షలు పెడితే రూ.8 లక్షల ఆదాయం..
ప్రభుత్వ సహ కా రంతో గతేడాది కర్నూ లులో అలంకార చేపల సాగు ప్రారంభించాం. ఎకరాకు ఓ పంటకు 1.50 లక్షల పెట్టుబడి పెడితే.. రూ.8 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం సాగు చేస్తున్న అలంకార చేపల చెరువులను అర్నమెంటల్‌ ఫిష్‌ కల్చర్‌ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నాం. 
– రెడ్డిపోగు అశోక్, మామిదాలపాడు, కర్నూలు జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top