అన్ని సబ్జెక్టుల మార్కుల ఆధారంగా గ్రేడ్లు

High Power Committee has finalized marks system for announcing results of Tenth - Sakshi

‘టెన్త్‌’ మార్కుల విధానం ఖరారు  

త్వరలో ప్రభుత్వానికి హైపవర్‌ కమిటీ నివేదిక 

ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఫలితాలు వెలువడే అవకాశం 

సాక్షి, అమరావతి: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్‌ కమిటీ ఖరారు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి.

అన్ని మార్కుల యావరేజ్‌తో గ్రేడ్లు
ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్‌ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్‌ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. అయితే బెస్ట్‌ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. 

► 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్‌–1, ఫార్మేటివ్‌–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్‌ఏ(ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్‌ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్‌ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్‌ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్‌ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్‌ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు. 
► 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్‌ అసెస్‌మెంటు(ఎఫ్‌ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్‌ అసెస్‌మెంటు (ఎస్‌ఏ) పరీక్ష ఒకటి రాసి ఉన్నారు. ఫార్మేటివ్‌ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్‌ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్‌ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్‌ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top