ఆ థర్డ్‌ డిగ్రీపై నిగ్గుతేల్చండి | High Court responds on Pulivendula police | Sakshi
Sakshi News home page

ఆ థర్డ్‌ డిగ్రీపై నిగ్గుతేల్చండి

Jun 18 2025 2:04 AM | Updated on Jun 18 2025 2:04 AM

High Court responds on Pulivendula police

పులివెందుల పోలీసుల తీరుపై స్పందించిన హైకోర్టు  

ఆ కౌన్సిలర్లకు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించండి 

కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశం 

తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల మున్సిపల్‌ కౌన్సిలర్లతోపాటు పలువురు కార్మికులపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. వారి శరీరాలపై ఎలాంటి గాయాలు లేవంటూ పులివెందుల ప్రభుత్వాసుపత్రి మెడికల్‌ ఆఫీసర్‌ తప్పుడు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చే బాధ్యతను కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు అప్పగించింది. పిటిషనర్లకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, మెడికల్‌ రిపోర్టులను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.   

దారుణంగా హింసించిన  డీఎస్పీ, సీఐ 
ఓ కేసులో పులివెందుల 4వ వార్డు కౌన్సిలర్‌ పి.కిషోర్, 25వ వార్డు కౌన్సిలర్‌ కావేటి మల్లికార్జున, 4వ వార్డు మాజీ కౌన్సిలర్‌ వెంకటపతితో పాటు పలువురు కార్మికులను పులివెందుల పోలీసులు గత నెల 28న అరెస్ట్‌ చేశారు. అనంతరం వారిని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్‌బాషా, రమణ కలిసి తీవ్రంగా కొట్టారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి హింసించారు. ఈ విషయాన్ని కౌన్సిలర్లు సంబంధిత మేజిస్ట్రేట్‌ దృష్టికి తీసుకొచ్చారు. వీరు చెప్పిన వివరాలను రికార్డ్‌ చేసిన మేజిస్ట్రేట్‌ వైద్య పరీక్షల నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పంపారు.

అయితే, బాధితుల ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని అక్కడి వైద్యులు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమకు కడప వెలుపల ఏదైనా ప్రముఖ ప్రభుత్వాసుపత్రిలో గానీ, స్వతంత్ర వైద్యుడి చేత గానీ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కౌన్సిలర్లు కిషోర్‌ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ హరినాథ్‌ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా కొట్టారన్నారు. 

పులివెందుల ప్రభుత్వాసుపత్రి వైద్యులు కూడా నిష్పాక్షికంగా వ్యవహరించకుండా పోలీసులు చెప్పినట్టు తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్లకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, దీనివల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. పిటిషనర్లను 24 గంటల్లోపు కర్నూలు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ ముందు హాజరుపరచాలని పులివెందుల పోలీసులను ఆదేశించారు. వీరికి తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలను తమ ముందుంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు.   

Advertisement
 
Advertisement
Advertisement