సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ 

High Court reserved judgment on ordering CBI investigation - Sakshi

నెల్లూరు జిల్లా కోర్టులో డాక్యుమెంట్ల చోరీ వ్యవహారం 

సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కాకాణి, సీబీఐ

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసు డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

నెల్లూరు జిల్లా కోర్టులో చోరీపై నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు మేలని పీడీజే నివేదికలో అభిప్రాయపడ్డారని గుర్తు చేసింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు తమకూ అభ్యంతరం లేదన్నారు.

కోర్టు ఆదేశిస్తే ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. సీబీఐ తరఫున జూనియర్‌ న్యాయవాది అలేఖ్య స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ సైతం సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మీరెలా ఈ విషయం చెబుతారని ప్రశ్నించింది. కోర్టు ముందున్న రికార్డుల ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి అభ్యంతరం లేదని అశ్వనీ కుమార్‌ చెప్పారు. దీనిని ధర్మాసనం రికార్డ్‌ చేసింది. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top