
అనారోగ్యం మన నియంత్రణలో ఉండదని తెలుసు కదా
రోగమొస్తే మన సాధారణ విధులే నిర్వర్తించలేం
మన నియంత్రణలో లేని వ్యవహారాల్లో నిబంధనల విధింపు సరికాదు
హాజరు నిబంధన సహేతుకం కాదు
బీటెక్ విద్యార్థి కౌశిక్‌ను నాలుగో సెమిస్టర్ తరగతులకు అనుమతించండి
అతని మూడో సెమిస్టర్ ఫలితాలూ వెల్లడించండి
కోర్సు పూర్తి చేసేందుకు ఎలాంటి ఆటంకాలు సృష్టించకండి
జీఎంఆర్‌ఐటీ కాలేజీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: అనారోగ్య కారణాలతో తరగతులకు హాజరు కాలేకపోయిన ఓ బీటెక్ విద్యార్థిని హాజరు తక్కువగా ఉందన్న కారణంతో నాలుగో సెమిస్టర్ పరీక్షలు రాసేందుకు అనుమతించకపోవడం, మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హాజరు విషయంలో కేవలం 10 శాతం వరకు మాత్రమే మినహాయింపునివ్వగలమంటూ జీఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (జీఎంఆర్‌ఐటీ) రూపొందించిన నిబంధనను తీవ్రంగా ఆక్షేపించింది.
ఆ కాలేజీ రూపొందించిన ఏకపక్ష నిబంధన ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొంది. ఈ నిబంధన రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అన్న సంగతి తేల్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అనారోగ్య కారణాలతో విద్యార్థి తరగతులకు హాజరు కాలేని సందర్భాల్లో ఎలాంటి కఠిన, నిర్దిష్ట నిబంధనలను రూపొందించడానికి వీల్లేదని వెల్లడించింది. ‘అనారోగ్యమనేది మనిషి అదుపులో లేని వ్యవహారం. ఈ విషయం అందరికీ తెలిసిందే. రకరకాల రోగాలు మనిషిని తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకుంటాయి.
మానవ నియంత్రణలో లేని ఇలాంటి వ్యవహారాల్లో ఎలాంటి నిబంధనలు రూపొందించడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇంత శాతం హాజరు ఉండి తీరాలన్న నిబంధనను ఏ రకంగానూ తీసుకురాలేరు. ఓ ప్రైవేటు యూనివర్సిటీ విద్యాపరంగా తీసుకొచ్చింది. అందువల్ల ఈ వ్యవహారంలో మేం జోక్యం చేసుకుంటున్నాం.’ అని హైకోర్టు తెలిపింది. పిటిషనర్ బీవీకే కౌశిక్ మూడో సెమిస్టర్ ఫలితాలను వెల్లడించాలని జీఎంఆర్‌ఐటీని హైకోర్టు ఆదేశించింది.
అలాగే అతన్ని నాలుగో సెమిస్టర్ తరగతులకు హాజరయ్యేందుకు అనుమతించాలనీ ఆదేశించింది. భవిష్యత్తులో కౌశిక్ ఇతర నిబంధనలన్నింటికీ లోబడి నడుచుకుంటే, ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా బీటెక్ కోర్సు మొత్తం పూర్తి చేసేందుకు అతన్ని అనుమతించాలని జీఎంఆర్ కాలేజీ, రాష్ట్ర విద్యాశాఖ, జేఎన్‌టీయూ వైస్ ఛాన్సలర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పు వెలువరించారు.
75 శాతం హాజరు లేదంటూ పరీక్షలకు అనుమతించని వైనం
శ్రీకాకుళం జిల్లా కేంద్రం మధురానగర్‌కి చెందిన బీవీకే కౌశిక్ రాజాంలోని జీఎంఆర్‌ఐటీలో బీటెక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ అండ్ డాటా సైన్స్ కోర్సు చేస్తున్నారు. అనారోగ్య కారణాల వల్ల 2024ఆగస్టులో 12రోజులు, అదే ఏడాది అక్టోబరులో మరో 10 రోజులు కాలేజీకి హాజరు కాలేదు. తన అనారోగ్యానికి సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లు, వైద్య పరీక్షల రిపోర్టులను కాలేజీకి విద్యార్థి సమర్పించారు. అయితే కాలేజీ వర్గాలు కౌశిక్‌ను మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు.
75 శాతం హాజరు లేదని, అందువల్ల పరీక్షకు అనుమతించలేమని తేల్చి చెప్పారు. దీంతో విద్యార్థి కౌశిక్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పిటిషనర్ విద్యార్థిని మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలని, పరీక్ష ఫీజు స్వీకరించాలని కాలేజీ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు విద్యార్థిని మూడో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించారు. కౌశిక్ తరఫు న్యాయవాది రిజ్వాన్ అలీ షేక్ వాదనలు వినిపించారు.
75 శాతం హాజరు ఉండాలని కాలేజీ నిబంధనలు చెబుతున్నాయని, ఇవే నిబంధనలు 10 శాతం మేర మినహాయింపునిచ్చేందుకు అనుమతినిస్తున్నాయన్నారు. పిటిషనర్ కౌశిక్‌కు 57.5 శాతం హాజరు ఉందని కాలేజీ వర్గాలు చెప్పాయన్నారు. 10 శాతం మినహాయింపుతో కనీస హాజరు శాతాన్ని 65 శాతంగా తీసుకుంటే కేవలం 7.5 శాతం మాత్రమే హాజరు తక్కువగా ఉందని వివరించారు.
అలాగే న్యాయమూర్తి అటు జీఎంఆర్‌ఐటీ కాలేజీ తరఫు న్యాయవాది, జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్నారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ 75 శాతం హాజరు లేదన్న కారణంతో విద్యార్థులు కఠిన పర్యవసానాలు ఎదుర్కొనేలా చేయడానికి వీల్లేదంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు.