ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి

Published Fri, May 31 2024 4:04 AM

High Court order to Central Election Commission and DGP

గుంటూరు రేంజి ఐజీ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారంపూడి ఇన్‌స్పెక్టర్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయి 

వారి విషయంలో శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి హైకోర్టు ఆదేశం 

ఏబీ వెంకటేశ్వరరావుకు గుంటూరు ఐజీ అత్యంత సన్నిహిత మిత్రుడు 

ఇన్‌స్పెక్టర్‌ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి 

అందుకే వీరిద్దరూ నా వెంట పడి తప్పుడు కేసులు పెడుతున్నారు 

నాపై పెట్టిన కేసుల దర్యాప్తు నుంచి వారిని దూరంగా ఉంచాలి.. హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్‌

సాక్షి, అమరావతి: మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అధికార విధుల నుంచి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్‌ త్రిపాఠీ, ఎస్పీ మలికా గార్గ్, కారెంపూడి ఇన్‌స్పెక్టర్‌ నారాయణ స్వామిని దూరంగా ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమర్పించిన వినతిపత్రంపై రేపటికల్లా (శుక్రవారంలోగా) నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున, పిన్నెల్లి వినతిపై వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టంచేసింది.త్రిపాఠీ, గార్గ్, నారాయణ స్వామిలపై చర్యలు తీసుకోవాలని, వారు పని చేస్తున్న స్థానాల నుంచి మార్చాలంటూ తానిచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకపోవడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి గురువారం కోర్టు విచారణ మొదలు కాగానే న్యాయమూర్తులు జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసర విచారణకు అభ్యర్థించారు. లంచ్‌మోషన్‌ అవసరం లేదని  ధర్మాసనం మొదట  చెప్పింది. అయితే నిరంజన్‌రెడ్డి అత్యవసరాన్ని వివరించారు. ఈ ముగ్గురు అధికారులు పిన్నెల్లికి వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన్ని కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు కోర్టుకు సైతం తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. ఈవీఎంల కేసులో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరువాత తిరిగి హత్యాయత్నం కేసులు పెట్టిన విషయాన్ని వివరించారు.

ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న ఈ అధికారులను పిటిషనర్‌పై నమోదు చేసిన కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉంచాలన్నారు. కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు వారిని విధుల నుంచి దూరంగా ఉంచితే సరిపోతుందని వివరించారు. దీంతో ధర్మాసనం లంచ్‌మోషన్‌ ద్వారా అత్యవసర విచారణకు అనుమతినిచ్చింది.

ఏబీ వెంకటేశ్వరరావు చెప్పినట్లే ఐజీ చేస్తున్నారు
గురువారం సాయంత్రం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిన్నెల్లి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఐజీ త్రిపాఠీ, ఇన్‌స్పెక్టర్‌ నారాయణస్వామిలపైనే తమకు అభ్యంతరం ఉందన్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సర్వశ్రేష్ట త్రిపాఠీ అత్యంత సన్నిహిత మిత్రుడుని, ఆయన చెప్పినట్లే చేస్తున్నారని తెలిపారు. అలాగే నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పారు.

వీరిద్దరూ పిన్నెల్లి పట్ల దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వేధిస్తున్నారని, కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిని తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఈ నెల 4 వరకు పిటిషనర్‌పై ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదు చేయకుండా, ఆ కేసుల దర్యాప్తులో వీరు భాగం కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్నికల సంఘం, పోలీసుల తీరును చూస్తుంటే రాష్ట్రంలో న్యాయ పాలన ఉందా అన్న సందేహం కలుగుతోందన్నారు. కోర్టు మాత్రమే తమకు రక్షణగా ఉందని, అందుకే మరోసారి కోర్టును ఆశ్రయించామని నిరంజన్‌రెడ్డి వివరించారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. పిన్నెల్లి వినతిపత్రంపై మీరేం చేస్తున్నారని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీనికి ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాష్‌ దేశాయ్‌ స్పందిస్తూ.. తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచిస్తానన్నారు. వినతిపత్రం తమకు ఇవ్వలేదని, డీజీపీకి ఇచ్చారని చెప్పారు. దీంతో ధర్మాసనం హోంశాఖ న్యాయవాదిని వివరణ కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున డీజీపీ కూడా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేస్తుంటారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల సంఘమేనన్నారు.

పిన్నెల్లి తన పిటిషన్‌లో కొందరు పోలీసు అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారని, అందువల్ల ఆయన వినతిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. రేపటికల్లా తగిన నిర్ణయం వెలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని ఆదేశించింది. పిన్నెల్లి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని వినతి పత్రంగా పరిగణించాలని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
 
Advertisement