అమూల్‌తో ఒప్పందం అమలుకు ఎలాంటి ఖర్చు చేయొద్దు

High Court order to Andhra Pradesh Govt On Amul contract - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

రఘురామకృష్ణరాజు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు

అమూల్, నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డులకు నోటీసులు

తదుపరి విచారణ 14కి వాయిదా

సాక్షి, అమరావతి: అమూల్‌తో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా పాలసేకరణ, మార్కెటింగ్‌ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాడి రైతుల లబ్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం–అమూల్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు, అమూల్, ప్రకాశం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌లకు నోటీసులు జారీచేసింది. వీరికి వ్యక్తిగతంగా నోటీసులు పంపే వెసులుబాటును రఘురామకృష్ణరాజుకు ఇచ్చింది. వీరికి నోటీసులు పంపిన రుజువులను కోర్టు ముందుంచాలని రఘురామను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీడీడీసీఎఫ్‌ ఆస్తుల బదలాయింపుపై మంత్రిమండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్‌ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలుకు జీవో 25ను రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.

అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం సవివరంగా దాఖలు చేసిన కౌంటర్‌ హైకోర్టు రికార్డుల్లో కనిపించలేదు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేస్తామని, అప్పటివర కు పిటిషనర్‌ కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రతిపాదించింది. దీనిని ప్రభుత్వ ప్రత్యేక న్యా యవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్‌ తీవ్రంగా వ్యతి రేకించారు. రాష్ట్రంలో పలు ప్రైవేటు డెయిరీలకు లబ్ధిచేకూర్చడం కోసమే అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు పిల్‌ వేశారని కోర్టుకు వివరించారు. పాడిరైతుకు లీటరు కు అదనంగా రూ.4 వస్తుంటే చూసి తట్టుకోలేక ఈ వ్యాజ్యం వేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతను తేల్చాలని కోరారు. అయినా.. ధర్మాసనం రఘురామకృష్ణరాజు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top