ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా? | High Court on appointment of chairpersons and members of consumer forums | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం విచక్షణాధికార పరిధిని దాటితే ఎలా?

Apr 30 2025 5:45 AM | Updated on Apr 30 2025 5:45 AM

High Court on appointment of chairpersons and members of consumer forums

వినియోగదారుల ఫోరంల అధ్యక్షులు, సభ్యుల నియామకంపై హైకోర్టు

మెరిట్‌ ఆధారంగా చేసిన ఎంపికకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందే

వైఎస్సార్, గుంటూరు, నెల్లూరు ఫోరంల అధ్యక్షుల నియామకం రద్దుకు సమర్థన

ఎంపిక కమిటీని నెల రోజుల్లో పునర్‌ నియమించాలని ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జిల్లా వినియోగదారుల ఫోరంల అధ్యక్షులు, సభ్యుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం తన విచక్షణాధికార పరిధిని దాటి వ్యవహరించిందని హైకోర్టు ఆక్షేపించింది. జిల్లా వినియోగదారుల ఫోరంల అధ్యక్షులు, సభ్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నేపథ్యం, అర్హత, యోగ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని ఎంపిక కమిటీకి తెలియజేయాల్సిందేనని స్పష్టం చేసింది. 

సదరు పోస్టుకు దరఖాస్తుదారు చేసుకున్న అభ్యర్థి అర్హత, నిజాయితీ విషయంలో ఎంపిక కమిటీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత దానిపై రాష్ట్ర ప్రభుత్వం మదింపు చేయడానికి వీల్లేదంది. మెరిట్‌ ఆధారంగా ఎంపిక కమిటీ చేసిన నిర్ణయానికే కట్టుబడి నియామకాలు చేయాలని తేల్చి చెప్పింది. క్రిమినల్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిని న్యాయ పదవిలో నియమించడం వింతగా ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది.

ఆ నియామకాల రద్దుకు సమర్థన
వైఎస్సార్, గుంటూరు, నెల్లూరు వినియోగదారుల ఫోరం అధ్యక్షులతో పాటు  వైఎస్సార్, తిరుపతి ఫోరం సభ్యుల నియామకాలను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. చిత్తూరు జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలి నియామకాన్ని రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీని నెల రోజుల్లోపు మళ్లీ నియమించాలని ఆదేశించింది. 

పునఃపరిశీలన నిమిత్తం అభ్యర్థుల నేపథ్యానికి సంబంధించిన రెండో నివేదిక, ఇతర సమాచారంతో పాటు తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక కమిటీ ముందుంచాలని స్పష్టం చేసింది. సంబంధిత ఫోరం కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను మొత్తం ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement