
సాక్షి, విశాఖపట్నం: రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని పేర్కొంది. నేడు అల్లూరి, మన్యం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కేంద్రకృతమైంది. నిన్న శ్రీకాకుళం, ఏలూరు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, గురువారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో వర్షం కురుస్తోంది. మరో రెండు గంటల పాటు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక, నిన్న శ్రీకాకుళం జిల్లాల్లో 5.3 సెంమీ వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రాప్తాడు, కందుకూరు, ఆకుతోటపల్లి వద్ద కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు, ఫైర్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.