ఎగువన వర్షాలతో నేడు కృష్ణాకు మరింత వరద

Heavy Rain At Maharashtra Increase Inflow Krishna River - Sakshi

ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి

సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల)/అచ్చంపేట(పెదకూరపాడు): కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 7,28,934 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి అంతేస్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. అదేస్థాయిలో దిగువకు వదులుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నదీ తీరప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 2009 అక్టోబర్‌ 5న తొలిసారిగా గరిష్ఠంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది.  

గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా పదిగేట్లను 20 అడుగుల మేర ఎత్తేసి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 5.07 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోనూ భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్, సుంకేశుల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదిలోకి చేరుతోంది.  (చదవండి: మహోగ్ర కృష్ణమ్మ)

వంశధారలో స్థిరంగా వరద ఉద్ధృతి 
ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధారలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 41,253 క్యూసెక్కులు చేరుతుండగా.. 43,197 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నాగావళి ప్రధాన ఉపనది అయిన సువర్ణముఖి నదిలో వరద మరింత పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టులోకి 25,428 క్యూసెక్కులు చేరుతుండగా.. 27,706 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి 
గోదావరిలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.


చంద్రబాబు నివాసం చుట్టూ వరద 

ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్‌ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్‌హౌస్‌లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్‌ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందన బ్రదర్స్‌ గెస్ట్‌హౌస్‌ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్‌లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్‌ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్‌హౌస్‌ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు.

మేం ఉంటే గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్‌లు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్‌: తాము అధికారంలో ఉంటే వరదల సమయంలో గంట గంటకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించేవాళ్లమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి గురువారం టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్‌ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్‌సీపీకి లెక్కేలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement 

Read also in:
Back to Top