విజయవాడలో దారుణం.. స్నేహితుల పనేనా..?

Harassment Of Women By Morphing Photos At Vijayawada - Sakshi

‘‘విజయవాడ పటమటలో నివసించే ఓ వివాహిత ఫొటోలను ఓ ఆగంతకుడు అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి ఆమె వాట్సాప్‌కే పోస్ట్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. పలు దఫాలుగా రూ.25 వేలు వసూలు చేశాడు. ఆ తరువాత ఆమె వద్ద డబ్బులు లేవని తెలుసుకున్న ఆ కీచకుడు అవే ఫొటోలను ఆమె భర్తతో పాటు మరికొందరికి పోస్ట్‌ చేశాడు. బాధిత మహిళ భర్త సహకారంతో ఇటీవల సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండేళ్ల క్రితం ఆమెతో పాటు కాలేజీలో చదువుకున్న ఇద్దరు వ్యక్తులు ఈ సైబర్‌ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి నిందితులను అరెస్ట్‌ చేశారు.  

విజయవాడ కృష్ణలంకకు చెందిన మహిళ సోషల్‌ మీడియా మాయగాళ్ల వేధింపులతో కొన్ని నెలలు మానసిక వేదన అనుభవించింది. ఆ వేధింపులను తాళలేక ఈ గండం నుంచి కాపాడాలంటూ ఓ స్నేహితుడిని సాయం కోరింది. అయినా ఫలితం లేకపోవడంతో చేసేది ఏమీలేక ఆమె సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణలో ఆ మహిళ సాయం కోరిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడ్డాడని వెల్లడైంది. దీంతో ఆమె అవాక్కయింది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూనే ఆమె ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడ్డాడు ఆ కీచకుడు’’.  

విజయవాడ : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌  వంటి సోషల్‌ మీడియాల్లో సైబర్‌ నేరాల పరంపర కొనసాగుతోంది. విద్యార్థునులు, యువ తులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని కొందరు కీచకులు వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితులకు తెలిసిన వ్యక్తులే ఈ తరహా నేరాలకు పాల్పడుతుండటం గమనార్హం. యువతులు, మహిళలతో చనువుగా ఉంటూ వారి ఫొటోలను సేకరించి అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు పోగొట్టుకుని, కొన్నాళ్లు మానసిక వేదన అనుభవించాక బాధితులు సైబర్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసుల విచారణలో తమతో అత్యంత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులే ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుసుకుని కంగుతింటున్నారు. గడిచిన 15 నెలల్లో ఒక్క విజయవాడలో 210 కేసులు వెలుగులోకి వచ్చాయి. 

స్వయంకృపరాధమే.. 
గృహిణులు, యువతులు, విద్యారి్థనులు అధిక సమయం స్మార్ట్‌ ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వీడియోలు, షార్ట్‌ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆ తరహాలో తాము సైతం గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో వ్యక్తిగత ఫొటోలు, భర్త, పిల్లలతో సరదాగా తీసుకున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. పరిచయాలను పెంచుకునే ప్రయత్నంలో తెలియని వారి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను కూడా ఆమోదిస్తున్నారు. అదును కోసం మాటు వేసిన సైబర్‌ నేరగాళ్లు వారితో పరిచయం పెంచుకుని మరిన్ని వీడియోలు, ఫొటోలను సేకరించి, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఎడిటింగ్‌ యాప్‌ల సాయంతో అసభ్యకరంగా మారి్ఫంగ్‌ చేసి వేధింపులకు దిగుతున్నారు.

ఇటీవల పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి  చెందిన ఓ వివాహిత ఇదే తరహాలో మోసపోయింది. తనతో పాటే చదువుకుంటున్న యువకుడు తన వీడియోను మారి్ఫంగ్‌ చేశాడని తెలియక సింగ్‌నగర్‌కు చెందిన మరో విద్యారి్థని మూడు నెలల పాటు మానసిక వేదన అనుభవించింది. మారి్ఫంగ్‌ వీడియోలు, ఫొటోల విషయం ఇంట్లో చెబితే ఏమంటారోనే భయంతో కీచకులు అడిగిన డబ్బు ఇవ్వడం, వారు చెప్పినట్లు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. గతంతో నగరాలకే పరిమితమైన ఈ నేరాలు ప్రస్తుతం పల్లెలకూ పాకాయని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా నేరాల్లో బాధితులు అధికంగా విద్యావంతులే ఉంటున్నా, 25 శాతం మంది బాధితులే పోలీసులను ఆశ్రయిస్తున్నారని సమాచారం. పరువు పోతుందని కొందరు, సైబర్‌ నేరాలపై అవగాహన లేక మరి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు.   

అప్రమత్తంగా ఉండాలి 
ఫేస్‌ బుక్, ఇన్‌స్టాగ్రా మ్‌లో ఎంతో మంది మోసగాళ్లు ఉంటారు. కొందరు మహిళలు పరిచయాలు పెంచుకునే క్రమంలో ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నారు. సైబర్‌ నేరాల కట్టడికి కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ‘చేరువ’ వాహనం ద్వారా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌ ప్రొఫైల్‌కు లాక్‌ చేస్తే మంచిది. మన  నుంచి వెళ్లిన ఫొటోలను మాత్రమే మోసగాళ్లు మారి్ఫంగ్‌ చేసి వేధిస్తారు. మన నుంచి మన ఫొటోలు వెళ్లకపోతే వారు ఏమీ చేయలేరు.  
– టి.కె.రాణా, పోలీస్‌ కమిషనర్, ఎన్టీఆర్‌ జిల్లా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top