
మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంతోపాటు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడటాన్ని రాష్ట్ర వికేంద్రీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ హనుమంతు లజపతిరాయ్ తీవ్రంగా ఖండించారు. త్వరలోనే కిడ్నీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్న విషయం పవన్‌కళ్యాణ్‌కు తెలియదా... అని ప్రశ్నించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సౌకర్యాన్ని సమకూర్చి, ఆ ప్రాంతంలో రీసెర్చ్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న వాస్తవాన్ని గ్రహించకుండా విమర్శించడం సరికాదన్నారు. ఇప్పటికే 63 డయాలసిస్ మెషిన్లు హరిపురం, కవిటి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలైనా ఈ పని చేశాయా అని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో సమస్యలు పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదించిందన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా కాకుండా ఆపడం ఎవరితరం కాదన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సానుకూల ప్రకటన చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును విమర్శించడం సరికాదని పేర్కొన్నారు. మూడు రాజధానులకు, ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు.