
మంత్రి సత్యకుమార్ ఇలాకాలో దమనకాండ
వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
ధర్మవరంలో పెచ్చరిల్లుతున్న అధర్మ వ్యాపారుల ఆగడాలు.. నూటికి రూ.10 వడ్డీ వసూలు చేస్తూ ప్రజల్ని పీడిస్తున్న వైనం
సర్కారు సంక్షేమం కొరవడడంతో వడ్డీ వ్యాపారుల కబంధహస్తాల్లో చేనేతలు
రెండునెలల్లోనే ముగ్గురు బలవన్మరణం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల దాషీ్టకాలు పెచ్చుమీరుతున్నాయి. నూటికి పది రూపాయల వడ్డీ వసూలు చేస్తూ పేదలను పీడించుకుతింటున్న వ్యాపారులు అంతటితో ఆగక భౌతిక దాడులకూ తెగబడుతున్నారు. వారి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అయినా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.
ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌లో ఈనెల 24న వడ్డీ చెల్లించలేదని చేనేత కుటుంబంపై ఏడుగురు వడ్డీ వ్యాపారుల ముఠా ఇష్టారాజ్యంగా దాడికి దిగిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా
మారాయి. ధర్మవరంలో రాజ్యమేలుతున్న దమనకాండను కళ్లకుకట్టాయి. – ధర్మవరం
కాళ్లావేళ్లా పడినా కనికరం లేకుండా..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన చేనేత కార్మికులు రమణ, భారతి దంపతులు ఎర్రగుంటకు చెందిన వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా వద్ద నూటికి ప్రతి వారం రూ.10 చొప్పున వడ్డీ చెల్లించేలా ఏడాదిన్నర క్రితం రూ.2 లక్షలు అప్పు చేశారు. ఆ తర్వాత కాటమయ్య, కాలా అనే ఇద్దరు మిత్రులకు రమణ చెరో రూ.2 లక్షల చొప్పున పూచీకత్తుపై అప్పు ఇప్పించాడు. అయితే వారు సక్రమంగా చెల్లించకపోవడంతో వారి వడ్డీ కూడా రమణే చెల్లించాడు.
ఇప్పటి వరకూ రూ.15 లక్షలు వడ్డీ రూపంలోనే చెల్లించాడు. అయినా వడ్డీ సక్రమంగా చెల్లించాలని రాజా వేధించేవాడు. ఈ క్రమంలో ఇప్పటికే మూడుసార్లు రాజాతోపాటు అతని అనుచరులు రమణపై దాడులు చేశారు. తాజాగా ఈ నెల 24న ఎర్రగుంట రాజాతోపాటు అతని అనుచరులు మొత్తం ఏడుగురు బాధితుడు రమణ ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలని బెదిరించారు. ప్రస్తుతానికి ఉపాధి లేదని, త్వరలోనే చెల్లిస్తామని కాళ్లావేళ్లాపడి ప్రాధేయపడినా వారు కనికరించలేదు.
రమణ, భారతి దంపతులను చుట్టుముట్టి ఇష్టానుసారం దాడి చేశారు. ‘కొట్టొద్దండి...చచ్చిపోతాం’ అంటూ ఎంత బతిమిలాడినా దయ చూపలేదు. అమానుషంగా దాడి చేశారు. దెబ్బలు భరించలేక వారు అరుస్తూ కేకలు వేసినా చుట్టుపక్కల వారు సైతం వడ్డీ వ్యాపారులకు భయపడి వారించే యత్నం చేయలేదు. దాడి చేసిన అనంతరం వడ్డీ వ్యాపారులు తాము మళ్లీ వచ్చేలోగా డబ్బులు చెల్లించాలని బెదిరించి వెళ్లారు. అదేరోజున దిక్కతోచని బాధితులు ధర్మవరం టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సీఐ రెడ్డప్ప వడ్డీ వ్యాపారులు ఎర్రగుంట రాజా, మహేష్, వినోద్‌తోపాటు ఏడుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. విషయం తెలుసుకున్న నిందితులు పరారీ కాగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారుల దాషీ్టకానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజా సంఘాల నేతలు, ప్రజలు వడ్డీ వ్యాపారుల దౌర్జన్యాలపై మండిపడుతున్నారు.

‘సంక్షేమం’ కొరవడి.. ప్రాణాలు ‘వడ్డీ’
ధర్మవరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలు అందక అత్యధికశాతం మంది చేనేత కార్మికులు, చిరువ్యాపారులు, చేతివృత్తులవారు తీవ్ర ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోయారు. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు. వాటిని తీర్చలేక, వేధింపులు తట్టుకోలేక అవస్థ పడుతున్నారు. ధర్మవరానికి చెందిన కొందరు కేరళ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ కూలి పనులు చేస్తూ వడ్డీలు కడుతున్నారు.
రెండు నెలల్లోనే ధర్మవరం నియోజకవర్గంలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వడ్డీ వ్యాపారులకు కొంతమంది టీడీపీ, బీజేపీ నాయకులతోపాటు కింది స్థాయి పోలీస్ సిబ్బంది కూడా అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌చేస్తున్నారు.