ఇక తిరగలేం సార్‌.. చచ్చిపోతా... | Frustrated Elderly Man Over Ancestral Property Dispute, Tries To Set Himself On Fire In Guntur | Sakshi
Sakshi News home page

ఇక తిరగలేం సార్‌.. చచ్చిపోతా...

Mar 3 2026 5:15 AM | Updated on Mar 3 2026 12:47 PM

Guntur Collectorate Elderly man attempts suicide

పాపయ్య ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న పోలీసులు

గుంటూరు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం..

ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నం

గుంటూరు వెస్ట్‌: ‘సొంతవాళ్లే మా ఆస్తి కాజేసి మమ్మల్ని రోడ్డుపాలు చేశారు. పోలీసులు మమ్మల్ని పిచ్చివాళ్లు అంటున్నారు. మూడు నెలలుగా తిరుగుతున్నాం. అయినా న్యాయం జరగడంలేదు. ఇక తిరగలేం.. బతకలేను... చచ్చిపోతాను సార్‌..’ అంటూ ఓ వృద్ధుడు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బాధితుడు దాసరి పాపయ్య తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు గ్రామానికి చెందిన దాసరి పాపయ్య, దాసరి ఆనందమ్మ వృద్ధ దంపతులు వారసత్వంగా వచ్చిన 3.5 సెంట్ల స్థలంలో ఇంటిని నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తెకు వివాహం చేయడంతో మరో ప్రాంతంలో ఉంటున్నారు.  

నమ్మించి నడిరోడ్డుపైకి నెట్టేసి... 
కొద్దికాలం కిందట పాపయ్య అన్న కుమార్తె శాఖమూరి లలితకుమారి వచ్చి ‘బాబాయి మిమ్మల్ని నేను చూసుకుంటాను’ అని నమ్మించింది. తన కుమారుడు అమెరికా వెళుతున్నాడని చెప్పి పాపయ్య నుంచి రూ.10 లక్షలు, ఆయన కుమార్తె వద్ద నుంచి దాదాపు రూ.70 లక్షలను లలితకుమారి తీసుకుంది. మూడు నెలల కిందట ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని పాపయ్య కోరితే లలితకుమారి అడ్డం తిరిగింది. పూర్వీకుల నుంచి వచ్చిన ఇంట్లో తనకూ వాటా ఉందని, వెంటనే ఖాళీ చేయాలని బెదిరించింది. పాపయ్య దంపతులు ఇంట్లో లేని సమయంలో వారి సామాగ్రి బయటపడేసి తాళాలు వేసింది. దీంతో పాపయ్య, ఆయన భార్య ఫిరంగిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వారు పట్టించుకోకుండా పాపయ్య దంపతులను పిచ్చివాళ్లు అంటూ హేళనగా మాట్లాడారు. ఇది సివిల్‌ మేటర్‌ అంటూ వదిలేశారు. దీంతో సోమవారం తన భార్యతో కలిసి పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వెంటనే పాపయ్య... ‘మూడు నెలలుగా తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇక న్యాయం జరగదు... ఇక బతకలేం..’ అంటూ కేకలు వేస్తూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆయన్ను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడే రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, ఆర్డీవో కె.శ్రీనివాసరావు వచ్చి బాధితులకు «ధైర్యం చెప్పి పాపయ్యను పోలీసుల సహకారంతో జీజీహెచ్‌కి పంపారు. 

Advertisement
 
Advertisement
Advertisement