విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం | Sakshi
Sakshi News home page

విశాఖ అభివృద్ధికి యకహోమాతో ప్రయోజనం

Published Sat, Aug 13 2022 4:51 AM

Gudiwada Amarnath On Yakahoma Tire Company At Visakha - Sakshi

అచ్యుతాపురం (అనకాపల్లి): అత్యంత ప్రతిష్టాత్మకమైన యకహోమా టైర్ల కంపెనీ అచ్యుతాపురం సెజ్‌కు రావడంతో విశాఖ జిల్లాకు ఎంతో ప్రయోజనం దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఈ నెల 16న అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీని ప్రారంభించి, మరో ఎనిమిది కంపెనీలకు శంకుస్థాపన చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న నేపథ్యంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను శుక్రవారం మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, మైనింగ్‌కు ఉపయోగించే వాహనాలకు అవసరమైన టైర్లను ఈ కంపెనీలో ఉత్పత్తి చేస్తారని చెప్పారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,500 కోట్లతో ఈ కంపెనీ నిర్మాణం పూర్తయిందని, ఈ కంపెనీ వల్ల స్థానికంగా ఉద్యోగావకాశాలు పెరిగాయని తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూములు కేటాయించి, పూర్తయిన కంపెనీల్లో ఇదొకటన్నారు.

విశాఖ పారిశ్రామిక అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి యకహోమా నాంది పలుకుతుందని చెప్పారు. ఈ కర్మాగారం విస్తరణకు మరో రూ.వెయ్యికోట్లు కేటాయించనున్నారని, తద్వారా మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు, కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, సీఈవో ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement