AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్‌బీఐ నివేదిక  | Growth in production and yield of major crops in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: ఉత్పత్తి అదిరింది.. ఆర్‌బీఐ నివేదిక 

Jan 1 2023 2:53 AM | Updated on Jan 1 2023 7:39 AM

Growth in production and yield of major crops in Andhra Pradesh - Sakshi

దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్‌ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్‌బీఐ ఈ నివేదికను విడుదల చేసింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్‌ పంట పండింది. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో అన్ని ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడిలో వృద్ధి నమోదైంది. 2021–22 కన్నా 2022–23లో ధాన్యం, ముతక, చిరు ధాన్యాలు, పప్పులు, నూనెగింజల ఉత్పత్తితో పాటు దిగుబడి­లోనూ పెరుగుదల నమోదైనట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.

దేశంలో గత ఖరీఫ్‌లో (2021–22) వ్యవసాయ ఉత్పత్తుల నాల్గవ ముందస్తు అంచనాలు, 2022–23 ఖరీఫ్‌ మొదటి ముందస్తు అంచనాలతో ఆర్‌బీఐ ఈ నివేదికను విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంటల ఉత్పత్తి, దిగుబడి, విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో ఎంతమేర వృద్ధి నమోదైందో ఈ నివేదికలో ఆర్‌బీఐ విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం.. 

మధ్యప్రదేశ్‌ రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రమే ధాన్యం ఉత్పత్తి గత ఖరీఫ్‌ కన్నా ఈ ఖరీఫ్‌లో పెరిగింది. మిగతా రాష్ట్రాల్లో క్షీణత నమోదైంది. జాతీయ స్థాయిలో కూడా గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తిలో 6.1 శాతం క్షీణత నమోదైంది. ఈ ఖరీఫ్‌లో మధ్యప్రదేశ్‌లో అత్యధికంతా ధాన్యం ఉత్పత్తి 46 శాతం వృద్ధి నమోదైంది. ఆ తరువాత రాజస్థాన్‌లో 32.3 శాతం.. ఆంధ్రప్రదేశ్‌లో 16.2, ఒడిశాలో 5.9, గుజరాత్‌లో 5.1, పంజాబ్‌లో 3.8, హరియాణాలో 2.9, ఉత్తరాఖండ్‌లో 1.7 శాతం వృద్ధి నమోదైంది. 

ఖరీఫ్‌ విస్తీర్ణంలో వృద్ధి ఇలా..
► అలాగే, దేశం మొత్తం ఖరీఫ్‌ విస్తీర్ణంలో 47 శాతం విస్తీర్ణం ఉత్తరప్రదేశ్,  ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే ఉంది.
► ఇక మన రాష్ట్రం విషయానికొస్తే.. వరి సాగు విస్తీర్ణం గత ఖరీఫ్‌తో పోలిస్తే ఈ ఖరీఫ్‌లో ఐదు శాతం మేర పెరిగింది. 
► ధాన్యం దిగుబడి 10.6 శాతం మేర వృద్ధి నమోదైంది. 
► రాష్ట్రంలో ముతక, చిరు ధాన్యాల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడిలో భారీ వృద్ధి నమోదైంది. 
► పప్పు ధాన్యాల విస్తీర్ణం, నూనె గింజల విస్తీర్ణం తగ్గినప్పటికీ ఉత్పత్తి, దిగుబడుల్లో భారీగా పెరుగుదల ఉంది.
► పత్తి విస్తీర్ణం, ఉత్పత్తి కూడా పెరిగినప్పటికీ దిగుబడి మాత్రం ఈ ఖరీఫ్‌లో తగ్గింది.

నిజానికి.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్‌లో కాలువల కింద సాగుకు నీటిని ముందస్తుగా విడుదల చేసింది. అలాగే, రైతులకు అవసరమైన విత్తనాలతో పాటు, ఎరువులను రైతుభరోసా కేంద్రాల ద్వారానే సకాలంలో అందించింది. సాగు విషయంలో రైతుల అవసరాలను తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement