
రామేశంమెట్ట కొండ పిండి
గతంలోనే గుల్ల.. మళ్లీ బరి తెగించిన తెలుగు తమ్ముళ్లు
యథేచ్ఛగా గ్రావెల్ దందా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగు తమ్ముళ్ల కన్నుపడితే కొండలు కూడా పిండైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్డులోని రామేశంమెట్ట కొండను తెలుగుతమ్ముళ్లు గుల్లచేసేశారు.
నాడు దాదాపు మూడున్నరేళ్లు ఏకబిగిన రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యమేలింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలి ఉన్న కొండను ఇప్పుడు టీడీపీ నేతలు, వారి అనుచరులు తవ్వేస్తున్నారు. మీకు సగం, నాకు సగం అంటూ పంపకాలు వేసుకుని మరీ సొమ్ము చేసుకుంటున్నారు.
టీడీపీ, జనసేన కుమ్మక్కై..
రామేశంమెట్టలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకూ 823 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితుల స్వయం ఉపాధి కోసం 1975లో అప్పటి ప్రభుత్వం రామేశంమెట్టను కేటాయించింది. 2014–19 మధ్య ఈ కొండలపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. అంతే పది పదిహేను అడుగుల లోతున తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి కేబినెట్‌లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశంమెట్ట కొండను గుల్ల చేసేసింది. రూ.కోట్లు కొల్లగొట్టింది.
నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నుల గ్రావెల్‌ను జిల్లా సరిహద్దులు దాటించేయడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆ మెట్టపై పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్లీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరీ మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు.
రోజుకు రూ.15 లక్షల వరకూ దోపిడీ..!
కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశంమెట్ట ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశంమెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014–19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు.
కొండకు రెండోవైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నాడు. మెట్ట ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి, పగలు పదుల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్‌ను తరలించేసి రామేశంమెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లలో గ్రావెల్ తరలించేసి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నట్టు సమాచారం.