బురిడీ బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

బురిడీ బడ్జెట్‌

Feb 15 2026 7:36 AM | Updated on Feb 15 2026 7:36 AM

బురిడ

బురిడీ బడ్జెట్‌

అప్పుల్లో నంబర్‌–1

ప్రజలపై పన్నుల భారం పెంచేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంది. అంకెల గారడీగా ఉన్న ఈ బడ్జెట్‌తో సామాన్యులకు, పేదలకు, రైతులకు ఒరిగిందేమీ లేదు. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.97 వేల కోట్లు అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. చంద్రబాబు నాయకత్వంలో మన రాష్ట్రం అప్పుల్లో నంబర్‌–1గా నిలిచింది. మూడో బడ్జెట్‌కు వచ్చినా.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి, రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి, కొత్త పెన్షన్ల మంజూరు వంటి వాటి ఊసే బడ్జెట్లో లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ, దీనికి బడ్జెట్‌లో ఏమీ కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ పథకానికి రూ.10,700 కోట్లు అవసరం కాగా రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. 54 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.20 వేల చొప్పున ఇవ్వాల్సిన పెట్టుబడి సాయానికి అరకొర కేటాయింపులే చేశారు. ధరల స్థిరీకరణకు కేటాయించింది రూ.500 కోట్లు మాత్రమే. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. బడ్జెట్లో అంకెలు చూపిస్తారు తప్ప క్షేత్ర స్థాయిలో అవి వాస్తవం కావు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్నారు కానీ ఆ ప్రస్తావనే లేదు. ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ, ఐఆర్‌ విడుదల అంశాలను బడ్జెట్లో పట్టించుకోలేదు.

– కర్నాకుల వీరాంజనేయులు,

ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్‌ రైతుకూలీ సంఘం

వివిధ రంగాల విస్మరణ

రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలు, ఆశలను నీరుగార్చేసింది. వివిధ రంగాలను విస్మరించింది. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరోసారి చాటుకున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 46.86 లక్షల మంది రైతులకు రూ.6,650 కోట్లు ప్రతిపాదించిన ప్రభుత్వం, అందులో భూమి లేని కౌలు రైతులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయం. రాష్ట్రంలోని సాగు భూమిలో 80 శాతం పంటలు పండిస్తున్నది కౌలు రైతులే. 35 లక్షల మంది కౌలు రైతుల్లో 10 లక్షల మందికి పైగా భూమి లేని నిరుపేదలే. వారికి పెట్టుబడి సాయం అందించకపోవడం అన్యాయం. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆడబిడ్డ నిధి పథకాలకు మంగళం పాడినట్టే.

– దాడిశెట్టి రాజా, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

విద్యారంగం నిర్వీర్యం

పాఠశాలలు, ఉన్నత విద్యకు కేటాయించిన నిధులు అరకొరగా ఉన్నాయి. దాదాపు రూ.7 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, నాడు–నేడు అసంపూర్తి పనులు, పెండింగ్‌ బిల్లులపై స్పష్టత ఇవ్వలేదు. నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకుండా మోసం చేశారు. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కేటాయింపు పూర్తి స్థాయిలో లేదు. హాస్టళ్లలోని విద్యార్థులకు కనీస మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వం చెల్లించని పరిస్థితి. విద్యారంగం నిర్వీర్యమైనట్టే.

– పెంకే రవితేజ,

జిల్లా నిరుద్యోగ జేఏసీ కన్వీనర్‌, కాకినాడ

విద్యారంగాన్ని విస్మరించారు

కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించింది. బడ్జెట్‌లో చేసిన అరకొర కేటాయింపులే దీనికి నిదర్శనం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం రూ.8,900 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ, రూ.3,836 కోట్లే కేటాయించారు. దీనినిబట్టి పాత బకాయిలపై విద్యార్థులు ఆశలు వదులుకోవలసిందేననే అనుమానం కలుగుతోంది. విద్యా రంగానికి బడ్జెట్‌లో 9.5 శాతం మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని అణచివేసి అందరూ ప్రైవేటు విద్యారంగం వైపు అడుగులు వేసేలా కుట్ర చేస్తోందనే అనుమానం కలుగుతోంది. మూడు రోజుల క్రితం రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్లు విద్యా మంత్రి లోకేష్‌ చేసిన ట్వీట్‌ ప్రకటనగా మాత్రమే మిగిలింది. తల్లికి వందనం నిధులు 80 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌ కేటాయింపులను బట్టి 67 లక్షల మందికే ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ పథకానికి కూడా శఠగోపం పెట్టినట్లే.

– తోట శ్రీరాంజీ, వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ/ప్రత్తిపాడు/గోకవరం/బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)/జగ్గంపేట: చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నీరుగార్చేసిందన్న విమర్శ సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రధానంగా ప్రాధాన్యతా రంగాలను పూర్తిగా విస్మరించారని వివిధ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఈ బడ్జెట్‌ అంకెల గారడీగానే కనిపిస్తోందని మేధావి వర్గం విశ్లేషిస్తోంది. పేరుకు రూ.3 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్‌గా చెప్పుకొంటున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చెప్పే గొప్పలకు.. చేసే పనులకు పొంతనే ఉండదనే విషయం ఈ కేటాయింపులు మరోసారి స్పష్టం చేశాయని చెబుతున్నారు.

వీటికి కేటాయింపులేవీ?

అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని లేకపోతే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడో బడ్జెట్‌ ముగిసినా ఆ హామీకి బడ్జెట్‌లో చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. జిల్లా జనాభా 22,47,680. జిల్లావ్యాప్తంగా 5,33,908 కుటుంబాలున్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసినా జిల్లాలో 5 లక్షల మంది పైగానే నిరుద్యోగులున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున లెక్క వేస్తే ప్రతి నెలా రూ.150 కోట్ల వరకూ నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంది. దీనికోసం ఈ బడ్జెట్‌లో నయా పైసా కూడా కేటాయించకుండా నిరుద్యోగులకు గతంలో మాదిరిగానే మరోసారి మొండిచేయి చూపారు.

జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో 1.80 లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వీరిలో 90 వేల మంది కౌలు రైతులే. ఈ బడ్జెట్‌లో కౌలు రైతులను విస్మరించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 73 వేల మంది రైతులకు రూ.400 కోట్ల మేర సాయం అందించేవారు. పైగా, ఉచిత పంటల బీమా వంటి అనేక పథకాలతో రైతులను ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటికీ మంగళం పాడింది. ప్రాధాన్య రంగమైన వ్యవసాయాన్ని ఈ బడ్జెట్‌లో సైతం పూర్తిగా చిన్నచూపు చూసిందని రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు.

19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలకు 2024 జూన్‌ నుంచి ప్రతి నెలా రూ.1,500 ఆడబిడ్డ నిధి ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో బాబు హామీ ఇచ్చారు. ఈ పథకానికి జిల్లాలో 5 లక్షల మందికి పైగా అర్హులని అంచనా. వీరికి ప్రతి నెలా సుమారు రూ.85 కోట్ల వంతున ఏడాదిన్నరగా ఈ సొమ్ము అందించాల్సి ఉంది. కానీ, షరా మామూలుగానే ఆ హామీకి ఈసారి కూడా బడ్జెట్‌లో స్థానం లేకుండా పోయింది.

జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని 59 వేల ఎకరాలకు సాగు, ప్రజలకు తాగునీరు అందించే ఏలేరు ప్రాజెక్ట్‌ ఆధునీకరణ విషయాన్ని ఈ బడ్జెట్‌లో విస్మరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. ఇక్కడి రైతుల కడగండ్లు తీర్చేలా ఏలేరు ఆధునీకరణకు రూ.300 కోట్లు కేటాయించాలనే ప్రతిపాదనలను సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ అంశంపై రైతులకు ఎన్నికల్లో హామీ ఇచ్చి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.

పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) ఆధునీకరణకు కూడా నిధులు కేటాయిస్తామని చంద్రబాబు, పవన్‌ గతంలో చెప్పారు. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారేమోనని సామర్లకోట నుంచి తొండంగి మండలం కోదాడ వరకూ ఉన్న 43 వేల ఎకరాల ఆయకట్టు రైతులు ఎదురు చూశారు. ఆధునీకరణకు నోచక సాగునీటి సమస్యతో పాటు ముంపును కూడా ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రతిపాదిత రూ.50 కోట్లు కేటాయించకపోవడంతో ఇక్కడి రైతులకు నిరాశే మిగలనుంది.

నిరుద్యోగులకు మొండిచేయి

వ్యవసాయంపై చిన్నచూపు

ఆడబిడ్డ పథకం అంతే సంగతులు

ఏలేరు, పీబీసీకి నిధులు నిల్‌

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజల పెదవి విరుపు

ఉద్యోగులకు మొండిచేయి

రూ.3,32,205 కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన నూతన వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ప్రకటించకపోవడం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. పెండింగ్‌ ఆర్థిక బకాయిలు, నాలుగు డీఏలు లేకపోవడం శోచనీయం. జాబ్‌ కేలండర్‌పై కనీస ప్రస్తావన కూడా లేకపోవడం నిరుద్యోగులకు నష్టం కలిగించే విషయం. విద్యారంగానికి కూడా కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. గత సంవత్సరం కంటే 0.14 శాతం తక్కువగా కేటాయించారు. బడ్జెట్‌ ఆమోదం పొందేలోగా విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలి.

– ఐ.ప్రసాదరావు, యూటీఎఫ్‌

సీనియర్‌ నాయకుడు, ప్రత్తిపాడు

అప్పులు తప్ప

ఆర్థిక ప్రగతి లేదు

బడ్జెట్‌లో అప్పులు తప్ప ఆర్థిక ప్రగతి, సంక్షేమ పథకాలు, అభివృద్ధికి తగిన కేటాయింపులు లేవు. దాదాపు రెండేళ్ల పాలనలో రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు ఇప్పించిన ఘనత కేంద్రానికి దక్కగా.. మరో రూ.లక్ష కోట్ల అప్పులకు ప్రస్తుత బడ్జెట్‌ రూపొందించినట్టుగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, విద్యుత్‌, నిత్యావసరాల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యుల పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఇకపై మరింత కష్టతరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. మితిమీరిన అప్పుల భారం గోరుచుట్టుపై రోకలి పోటులా ఉంది.

– దూసర్లపూడి రమణరాజు, కన్వీనర్‌,

పౌర సంక్షేమ సంఘం, కాకినాడ

గారడీ బడ్జెట్‌

రాష్ట్ర బడ్జెట్‌ మాటల్లో గొప్ప చేతల్లో శూన్యంగా కనబడుతుంది. చంద్రబాబు మాటల గారడీలా ఉంది. ఇది తిరోగమన బడ్జెట్‌. సామాన్యులకు ఈ బడ్జెట్‌ బహు దూరం. నిరుద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు ఊసే లేదు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని ఇప్పటి వరకూ చెప్పి.. ఇప్పుడు 60 శాతం మాత్రమే పూర్తయిందని చెప్పడం బాబు పచ్చి అబద్ధాలకు నిదర్శనం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల ప్రస్తావన లేదు. విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశారు. రైతులను విస్మరించడం దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కౌలు రైతులను కూటమి సర్కార్‌ దగా చేసింది.

– తాటిపాక మధు,

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు

బురిడీ బడ్జెట్‌1
1/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌2
2/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌3
3/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌4
4/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌5
5/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌6
6/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌7
7/8

బురిడీ బడ్జెట్‌

బురిడీ బడ్జెట్‌8
8/8

బురిడీ బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement