పంచారామం.. శివమయం
● మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు
● అమ్మ, స్వామివార్లకు
వధూవరులుగా అలంకరణ
● నేటి రాత్రి కల్యాణంతో వేడుకలకు శ్రీకారం
● 15న మహాశివరాత్రి
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టుకుంటున్న వేళ.. సామర్లకోటలోని సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం శివనామంతో ప్రతిధ్వనిస్తోంది. ఏటా మాఘ మాసంలో బహుళ ఏకాదశి నాడు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవంతో ఇక్కడ శివరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఈ క్షేత్రంలో కొలువుదీరిన బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారిని వధువుగా, కుమారారామ భీమేశ్వరస్వామి వారిని వరునిగా గురువారం అలంకరించారు. దీనిలో భాగంగా ఆలయంలోని నంది మండపం వద్ద ముత్తయిదువలు ఉదయం పసుపు దంచారు. అర్చకుల దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు మంగళ స్నానాలు చేయించి, మేళతాళాలు, వేద మంత్రాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. సన్నిధిరాజు వెంకన్నబాబు దంపతులు పీటలపై కూర్చుని స్వామి వారిని వరునిగా.. అమ్మవారిని వధువుగా అలంకరించి, ప్రత్యేక వేదికపై వేంచేయించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్‌రావు దంపతులు పట్టు వస్త్రాలు, అలంకరణ సామగ్రిని అందజేశారు. శ్రీచక్ర పండితుడు వేమూరి సోమేశ్వరశర్మ, అభిషేక పండితుడు అళ్లకి రాజ్‌గోపాల్‌శర్మ, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి పూజాదికాలు నిర్వహించారు. అర్చకులు చెరుకూరి రాంబాబు, శ్రీకాకుళపు వినయ్, ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. పలువురు భక్తిపారవశ్యంతో ఈ అపురూప సన్నివేశాన్ని తిలకించారు.
యోగలింగ రూపుడై..
సామర్లకోట పంచారామ క్షేత్రంలో బాలాత్రిపురసుందరీ సమేత కుమారరామ భీమేశ్వరస్వామి వారు కోరిన కోర్కెలు తీర్చుతాడని భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రంలోని అతి ప్రాచీన పంచారామ క్షేత్రంలో ఇది ప్రముఖమైనది. ఈ క్షేత్రం పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిద్ధి చెందినట్లు ఇక్కడి శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ పరమేశ్వరుడు యోగ లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ శివలింగాన్ని ఆ పరమేశ్వరుడి తనయుడైన కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించాడని, అందువల్లనే ఈ స్వామిని కుమారారామ భీమేశ్వరునిగా పిలుస్తారని చెబుతారు. పిఠాపురంలో లభించిన శాసనం ప్రకారం తొమ్మిదో శతాబ్దం చివరిలో వేంగి చాళుక్య పాలకుడైన మొదటి చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అందువలన ఈ ఆలయాన్ని చాళుక్య కుమారారామ భీమేశ్వరాలయంగా పిలుస్తారు.
ఎన్నో విశేషాలకు నెలవు
ఈ క్షేత్రంలో 14 అడుగుల స్ఫటిక శివలింగం ఉంది. ఆలయం చుట్టూ చెక్కిన రాతితో కట్టిన రెండు ప్రాకారాలున్నాయి. వెలుపలి ప్రాకారానికి నాలుగు దిక్కుల్లో నాలుగు గోపుర ద్వారాలున్నాయి. లోపలి ప్రాకారం మధ్యలో భీమేశ్వరాలయాన్ని చతురస్రాకారంగా ఒక అంతస్తుతో నిర్మించారు. భక్తులు కింది నుంచి మొదటి అంతస్తులోనికి ప్రవేశించి, పైన ఉన్న శివలింగాన్ని రుద్ర రూపునిగా పూజిస్తారు.
ఆలయంలో ఉన్న శిలాస్తంభాలను దేనికదే ప్రత్యేకంగా చెక్కడం విశేషం. ఆలయంలోని సుందర నిర్మాణాల్లో ముఖ్యమైనది నూరు స్తంభాల మండపం. ఆలయంలోని ఊయల మండపం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేటికీ ఈ మండపం ఊపితే ఊగుతుంది.
ఈ క్షేత్రంలోని కోనేరు ఎదురుగా ధ్వజస్తంభం వద్ద నుంచి ఆలయంలోనికి ప్రవేశించగానే ఏకశిలతో చెక్కిన పెద్ద నందీశ్వరు విగ్రహం దర్శనమిస్తుంది. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి గంటను ఒకసారి మోగిస్తే ఓంకారం ధ్వనిస్తుంది.
స్వామి వారి ఆలయం చుట్టూ సూర్యనారాయణమూర్తి, గణపతి, సప్తమాతృకలు, దత్తాత్రేయస్వామి, సరస్వతి, కుమారస్వామి, మహిషాసురమర్దిని, మహావిష్ణులక్ష్మీదేవి, చండీశ్వరస్వామి, వీరభద్రస్వామి, సుబ్రహ్మణేశ్వర స్వామి ఉప ఆలయాలున్నాయి. వీటిల్లోని దేవతలను దర్శించుకున్న తరువాత భక్తులు భీమేశ్వరస్వామిని, తరువాత బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకుంటారు.
చైత్ర, వైశాఖ మాసాల్లో ఉదయం పూట సూర్యుని సువర్ణ కిరణాలు స్వామివారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకే విధంగా ఆలయ నిర్మాణం జరగడం విశేషం.
ఆలయంలో పశ్చిమంగా ఉన్న ఏకశిలా స్తంభాన్ని స్థానికులు కప్పస్తంభంగా పిలుస్తారు. దీనిపై ఉన్న శాసనాన్ని బట్టి కొంతమంది దొంగలు నిధి దొరుకుతుందనే ఆశతో నందిని తొలగించారని, చాళుక్య వంశానికి చెందిన నరసింహుని భార్య లక్ష్మి రాజమండ్రిలోని కోటిలింగాల రేవు నుంచి రాతిని తెప్పించి కొత్త నంది విగ్రహాన్ని చెక్కించి పునఃప్రతిష్ఠించారని తెలుస్తోంది. ఈ స్తంభానికి ఎదురుగా సుమారు 200 గజాల దూరంలో ప్రాచీన మాండవ్య నారాయణస్వామి ఆలయం ఉంది.
సర్వం సిద్ధం
పంచారామ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ, దీక్షధారణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం ఇత్తడి నంది వాహనంపై స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం జరుగుతుంది. గ్రామోత్సవం ఆలయానికి వచ్చే సమయంలో మదుగులమ్మ ఆలయం వద్ద స్వాగతం పలుకుతారు. అదే రోజు రాత్రి స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుంది. 14న స్వామివారికి అభిషేకాలు, పూజలు చేస్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 15వ తేదీ వేకువజామున పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహుదూర్ గోత్రనామాలతో పూజలు, అభిషేకాలు చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజ నిర్వహిస్తారు. 16వ తేదీ ఉదయం స్వామివారికి అభిషేకాలు, పూజలు, అమ్మవారికి కుంకుమార్చన, మధ్యాహ్నం గాంధీ చౌక్ నుంచి రథోత్సవం జరుగుతాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించే రథోత్సవానికి రూ.7 లక్షలు కేటాయించాం. 17వ తేదీ ఉదయం త్రిశూల స్నానం, తీర్థపు సేవ, 18వ తేదీ రాత్రి ఆరు గంటలకు తెప్పోత్సవం, అనంతరం శ్రీపుష్పయాగోత్సవంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్నదానం, అల్పాహారం, పాలు, మజ్జిగ, మంచినీరు అందించడానికి దాతలు ముందుకు వచ్చారు. వారికి స్థలాలు కేటాయించాం.
– ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్
కంటే జగదీష్ మోహన్‌రావు
పంచారామం.. శివమయం
పంచారామం.. శివమయం
పంచారామం.. శివమయం
పంచారామం.. శివమయం


