అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ, వైశాఖ శుద్ధ దశమి నుంచి మే రెండో తేదీ వరకు వారం రోజుల పాటు సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ వీ త్రినాథరావు తెలిపారు. రత్నగిరిపై శుక్రవారం కల్యాణోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం పండితులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ లోగా వివిధ విభాగాల వారీగా దేవస్థానం అధికారులు చేపట్టే పనుల గురించి నివేదికలు తయారు చేసి తనకు అందజేయాలని ఆదేశించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్య శర్మ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మంజులా దేవి, ఈఈ లు నూకరత్నం. వీ రామకృష్ణ పాల్గొన్నారు.
కల్యాణ మహోత్సవాల షెడ్యూల్
● ఏప్రిల్ 26న సత్యదేవుడు,
అమ్మవారిని వధూవరులను చేయడం
● 27న రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం
● 28న స్థాలీపాక హోమాలు, అరుంధతి దర్శనం, రావణ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
● 29న పండిత సదస్యం, కొండ దిగువన పొన్న వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు
● 30న వనవిహారోత్సవం, రథోత్సవం.
● 1న ఉదయం పంపానదిలో శ్రీచక్రస్నానం, సాయంత్రం నాకబలి, దండియాడింపు
● 2న రాత్రి ఏడు గంటల నుంచి శ్రీపుష్పయాగం
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
● భక్తులు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీల ఏర్పాటు. కల్యాణం అయ్యాక తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి తొమ్మిది కౌంటర్ల ఏర్పాటు.
● కల్యాణానికి విచ్చేసే వీఐపీల వద్దకే వెళ్లి స్వామివారి శేషవస్త్రం, తలంబ్రాలు అందజేయాలి. వారితో బాటు ఎవరినీ కల్యాణ వేదిక వద్దకు అనుమతించరాదు.
● ఉత్సవాల ఏడు రోజులు రత్నగిరిపై, కొండదిగువన మెడికల్ క్యాంపుల నిర్వహణ.
● దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్‌లు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరాలి.
27న కల్యాణం 30న రథోత్సవం


