ఇళ్ల స్థలాల భూమిని అన్యాక్రాంతం చేస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల స్థలాల భూమిని అన్యాక్రాంతం చేస్తే ఊరుకోం

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

లబ్ధిదారులతో కలిసి

ఆందోళనకు దిగుతాం

వైఎస్సార్‌ సీపీ పిఠాపురం

నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత

పిఠాపురం: స్థానికంగా నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వెంటనే దానిని ఆపకపోతే ఆందోళనకు దిగుతామని వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత హెచ్చరించారు. ఆమె గురువారం పిఠాపురం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ పిఠాపురం మసీదు మాన్యంలో ఐదు ఎకరాల భూమిలో సుమారు 250 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేసి మరీ అప్పగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టించకపోగా ఆ భూమిని స్వాధీనం చేసుకుని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఇచ్చిన స్థలాలను లాక్కోడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పేదలకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాటం చేసి ఇళ్లు కట్టించే వరకు వారికి అండగా ఉంటామన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతీ పేదవాడి సొంతింటి కల నెరవేరాలనే సంకల్పంతో రూ.కోట్లు వెచ్చించి రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏకంగా కొత్త కాలనీలనే నిర్మించారన్నారు. కాని కూటమి నేతలు పేదల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

అక్కడ ఆస్పత్రి.. ఇక్కడ కాలేజీ హాస్యాస్పదం

కాకినాడలో మంజూరైన ఆయుష్‌ కాలేజీ నిర్మాణానికి పిఠాపురంలో మసీదు మాన్యం భూమిని కేటాయించడం దారుణమన్నారు. మసీదు మాన్యంలో వందల మంది పేదలు ఇళ్లు కట్టుకోడానికి సిద్ధపడుతుంటే వారికి అన్యాయం చేస్తు కాకినాడ కట్టాల్సిన కాలేజీని పిఠాపురంలో కట్టడానికి ప్రయత్నించడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. కాకినాడలో ఉన్న భూమిని తెలుగుదేశం నేతకు కట్టబెట్టడానికి అక్కడ కట్టాల్సిన కాలేజీని ఇక్కడకు మార్చారని ఆమె ఆరోపించారు. కాకినాడలో ఆయుష్‌ ఆస్పత్రిని తన హయాంలో నిర్మిస్తే రెండేళ్లు దానిని ప్రారంభించకుండా వదిలేశారన్నారు. ఆయుష్‌ ఆస్పత్రి ఉన్న చోటే ఆయుష్‌ కాలేజీ కూడా ఉండాలన్న విషయం పాలకులకు అర్థం కాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నిరు పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, ఉలవల భూషణం, పచ్చిమళ్ల జ్యోతి, సోమరౌతు లలిత, బొజ్జారామయ్య పాల్గొన్నారు.

ఇంత బరి తెగింపా?

పిఠాపురం: చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి కాకినాడలో రూ.కోట్ల విలువైన ఆయుష్‌ కళాశాల భూమిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మకు కట్టబెట్టి, పిఠాపురంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ఆయుష్‌ కళాశాలకు ప్రతిపాదించడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఆయన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకినాడ గరల్స్‌ పాలిటెక్నిక్‌ సమీపంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని తాజ్‌ హోటల్‌ పేరుతో మోసం చేస్తూ వర్మకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై శనివారం కాకినాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యమేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. నెల రోజులుగా ఆయుష్‌ ఆసుపత్రిపై చర్చ జరుగుతున్నా స్పందించడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement