సామర్లకోట: పెద్దాపురంలోని వెంకటేశ్వరా రైసుమిల్లులో గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసుమిల్లులో రేషన్ బియ్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ కన్నబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లులో రైతుల నుంచి సేకరించిన ధాన్యం, బియ్యం నిల్వ వివరాలను నమోదు చేసుకున్నారు. రైసుమిల్లు సామర్థ్యం, కార్మికుల భద్రత, రైసు మిల్లుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల అమలును జేసీ పరిశీలించారు. అంతకుముందు పట్టణ పరిధిలోని రేషన్ షాపులలో పేద ప్రజలకు బియ్యం ఏవిధంగా సరఫరా చేస్తున్నారో ఆరా తీశారు. షాపులలో బియ్యం నిల్వ, స్టాక్ రిజిస్టర్, సరకుల నాణ్యత, తూకం, బిల్లింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం మెయిన్‌రోడ్డులోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీని క్షుణ్ణంగా పరిశీలించారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఆ గ్యాస్ ఏజెన్సీ వద్ద రోజూ వినియోగదారులు బారులు తీరడంతో ఏజెన్సీ ప్రతినిధి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ లోపాలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ విక్రయం జరుగుతున్నట్టు గుర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి సత్యనారాయణరాజు, తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.


