బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సదుపాయాలు కల్పిస్తానని జిల్లా దేవదాయశాఖాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ అన్నారు. స్థానిక జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో తన చాంబర్‌లో గురువారం ఆయన జిల్లా దేవదాయశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సూర్యనారాయణకు జిల్లాలోని పలు దేవాలయాల ఈవోలు, సత్రాల ఈవోలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూర్యనారాయణ కలెక్టర్ హరేందిరప్రసాద్‌ను కలెక్టరేట్‌లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
వాడపల్లి వెంకన్నకు వైభవోపేతంగా చక్రస్నానం
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గౌతమీ గోదావరిలో స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం హోమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే చక్రస్నానంలోనూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం గౌతమీ గోదావరి తీరంలో చోర సంవాదం జరిగింది.
దళిత క్రైస్తవులను
ఎస్సీలుగా గుర్తించాలి
అమలాపురం రూరల్: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గెడ్డం సంపదరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజు ఆకివీడు గ్రామంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తిక సత్యనారాయణ, కార్యదర్శి కోణాల ప్రకాష్, కోశాధికారి కాండ్రేగుల గంగరాజు, అమలాపురం ఇన్‌చార్జి పొలమురి మోహన్ బాబు పాల్గొన్నారు.


