ఘనంగా సీతారాముల శ్రీచక్రస్నానం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా సీతారాముల శ్రీచక్రస్నానం

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

అన్నవరం: రత్నగిరిపై నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఎనిమిదో రోజు చైత్ర పౌర్ణిమ, గురువారం పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు వెంట రాగా పల్లకీ మీద నవదంపతులు సీతారాములను పంపా తీరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వేదికపై నవదంపతులు సీతారాములను ఒక సింహాసనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను మరో సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత సీతారాములకు, శ్రీచక్రానికి పండితులు అవభృత స్నానం నిర్వహించారు.

అనంతరం సీతారాముల విగ్రహాలను శ్రీచక్రాన్ని పండితుల మంత్రోఛ్చాటన మధ్య ఊరేగింపుగా పంపా నదికి తీసుకువెళ్లారు. తరువాత పంపా నదిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. స్నానం అనంతరం మళ్లీ సీతారాములను సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు సమక్షంలో నవదంపతులు సీతారాములుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు సీతారాముల విగ్రహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నృత్యం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి రామాలయంలో సీతారాములకు శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement