అన్నవరం : శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా తొమ్మిదో రోజు, శుక్రవారం రాత్రి 7–30 గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ సీతారాములకు శ్రీపుష్పయాగం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవ దంపతులు శ్రీసీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. అనంతరం శ్రీసీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. శ్రీ సీతారాములకు వివిధ రకాల పిండివంటలు నివేదించారు. అనంతరం పండితులు వేదాశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టుముక్కలను పంపిణీ చేశారు. భక్తులు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు.
నేడు సీపీఐ రౌండ్
టేబుల్ సమావేశం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాలని కోరుతూ శనివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక బాలాజీ చెరువు సమీపంలో కాస్మోపాలిటన్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పాల్గొంటారన్నారు. మూడు ఎకరాల 4 సెంట్ల భూమి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మకు కట్టపెట్టడం దారుణమని పేర్కొన్నారు.
హాకీ క్రీడాకారిణుల
ఎంపికలు రేపు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా హాకీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జూనియర్స్ బాలికల విభాగంలో క్రీడాకారిణుల ఎంపికలు నిర్వహిస్తున్నట్టు సంఘ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 15 నుంచి చిత్తూరులో జరిగే ఏపీ అంతర్ జిల్లాల హాకీ పోటీలలో పాల్గొంటుందన్నారు. 1–12007 తరువాత జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 8 గంటలకు డీఎస్‌ఏలోని హాకీ మైదానంలో హాజరుకావాలని కోరారు.
ఏలేరు ప్రాజెక్టును పరిశీలించిన
కలెక్టర్ హరేందిరప్రసాద్
ఏలేశ్వరం: కలెక్టర్ హరేందిర ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఏలేరు ప్రాజెక్టును శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టు సామర్థ్యంతో పాటు ప్రస్తుత నీటిమట్టం, సాగునీటి పరిస్థితులు, తాగునీటి సరఫరా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు వద్ద సిబ్బంది కొరత ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. అనంతరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న మణిహంస పవర్ ప్రాజెక్టును పరిశీలించారు. ఈఈ వెంకటేశ్వరావు, డీఈ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
టెన్త్ ఇంగ్లిషు
ప్రశ్నపత్రంపై ఆందోళన
రాయవరం: పదో తరగతి పరీక్షలు ఈ నెల 2న ఇంగ్లిషు పరీక్షతో ముగిశాయి. ఇంగ్లిషు పేపరు బ్లూప్రింట్‌కు డీవియేట్ అయినట్లు ఇంగ్లిషు ఫోరమ్ సైతం ఆరోపిస్తోంది. ముఖ్యంగా 17, 18, 22, 25, 28, 31, 32 ప్రశ్నలు సబ్జెక్టుకు డీవియేట్ అయ్యాయని డీజీఈకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. దీనివల్ల విద్యార్థులు 15 మార్కులు నష్టపోతున్నారని చెబుతున్నారు. తాము కోల్పోతున్న 15 మార్కులూ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.


