అధికార పార్టీ వారే పూజలు చేయాలా? | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ వారే పూజలు చేయాలా?

Feb 13 2026 3:44 AM | Updated on Feb 13 2026 3:44 AM

అధికార పార్టీ వారే పూజలు చేయాలా?

అధికార పార్టీ వారే పూజలు చేయాలా?

శివరాత్రి పనులు చేయించే

హక్కు సర్పంచ్‌కు లేదా?

తిమ్మాపురంలో పోలీసులది ఏకపక్ష వైఖరి

సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణపై

తప్పుడు సెక్షన్లతో కేసులు

ఆయన ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదు?

రెండో పక్షంపై ఎందుకు కేసు పెట్టలేదు?

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ రూరల్‌: ‘దేవుడిపై అధికార పార్టీకే హక్కుందా? వారు మాత్రమే పూజలు చేయాలా? మహాశివరాత్రి ఉత్సవాల పనులు చేయించే హక్కు గ్రామస్తుల తరఫున సర్పంచ్‌కు లేదా? తిమ్మాపురంలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిమ్మాపురంలోని విశాలక్ష్మి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయం వద్ద బుధవారం వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఆ గ్రామ సర్పంచ్‌, వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణను, మరికొందరిని పోలీసులు అరెస్టు చేయడాన్ని కన్నబాబు తీవ్రంగా ఖండించారు. రమణయ్యపేట వైద్య నగర్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిమ్మాపురంలో బుధవారం నుంచి పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తూంటే రాష్ట్రంలో చట్టాలున్నాయా లేక చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను రెండుగా విడగొట్టి చట్టాలు చేస్తున్నారా అనేది అనుమానంగా ఉందని విమర్శించారు. పోలీసులు చాలా దుర్మార్గంగా వైఎస్సార్‌ సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. బెజవాడ సత్యనారాయణ, మరికొందరు గ్రామస్తులను రాత్రంతా అక్రమంగా నిర్బంధించి, తిమ్మాపురం పోలీసు స్టేషన్‌లో ఉంచి, తెల్లవారుజామున ఇంద్రపాలెం స్టేషన్‌కు తరలించి, తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారని అన్నారు.

సర్పంచ్‌పై దురుసుగా ప్రవర్తించారు

తిమ్మాపురంలో టీడీపీ 2016లో అధికారంలో ఉన్నప్పుడు గ్రామస్తుల విరాళాలతో ఊరుమ్మడి స్థలంలో శివాలయం నిర్మించారని కన్నబాబు తెలిపారు. దీనికి కరెంట్‌ చార్జీలను పంచాయతీయే చెల్లిస్తోందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలయానికి శివరాత్రి నాడు వెళ్లేవాడినన్నారు. వచ్చే శివరాత్రికి శివపార్వతుల కల్యాణం జరుగుతుందనే సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఆటోలో ప్రచారం చేస్తూంటే తిమ్మాపురం ఎస్సై గణేష్‌ కుమార్‌ అడ్డుకున్నారని, ఆ ఆటోను స్టేషన్‌కు తరలించారని చెప్పారు. అధికార పార్టీలో చేరిన శ్రీరామకృష్ణకు మాత్రమే హక్కుందని చెప్పి, శివాలయం వద్ద పనులు చేయించేందుకు వెళ్లిన సర్పంచ్‌ తదితరులను వెనక్కి పంపించారన్నారు. ఈ ఉత్సవాన్ని ఒక పార్టీకి సంబంధించినదిగా చిత్రీకరించవద్దని బెజవాడ సత్యనారాయణ చెప్పగా.. ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. గ్రామంలోని జనసేన, కూటమి నాయకులు ఆలయం వద్దకు వెళ్లినట్లు తెలుసుకుని, ఇటు నుంచి కొంత మంది పెద్దలు వెళ్లగా అక్కడ వాగ్వాదం జరిగిందని చెప్పారు. పోలీసులు ఇరు వర్గాలనూ స్టేషన్‌కు పిలిపించారని, సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై గణేష్‌ కుమార్‌ తప్పుడు సెక్షన్లతో సర్పంచ్‌ తదితరులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, రకరకాల సెక్షన్లు పెట్టి, రిమాండ్‌ వచ్చేలా చేశారని అన్నారు. బాధితులుగా ఉన్న సర్పంచ్‌ తదితరులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకోలేదని, పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఇంద్రపాలెం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన సర్పంచ్‌ బంధువుల ఫోన్లు లాక్కున్నారన్నారు. ఫలానా వ్యక్తి, ఫలానా పార్టీయే పూజలు చేయాలని ఎక్కడైనా ఉంటుందా.. గ్రామంలో పూజలు, కల్యాణంలో పాల్గొనడం అందరి హక్కూ కాదా అని కన్నబాబు ప్రశ్నించారు.

ఐపీఎస్‌లకు ప్రేక్షక పాత్ర తగదు

ఐపీఎస్‌ అధికారులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, జిల్లాలోని పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా పని చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. ఎల్లవేళలా అధికారం ఒకేచోట ఉండదని, చట్టాలను గౌరవించి, అమలు చేయాలని పోలీసులను కోరారు. నిజంగా తప్పుంటే ఇరు పక్షాలపై కేసులు పెట్టాలన్నారు. సర్పంచ్‌ను నీకేంటి సంబంధమని అన్నారని.. ఆ గుడి ప్రైవేటు స్థలంలో ఉందా అని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టులకు వైఎస్సార్‌ సీపీ భయపడదని, పోలీసు అధికారులు తీరు ఎంతమాత్రం సబబు కాదని అన్నారు. ఇవే విధానాలు అనుసరిస్తే భవిష్యత్తులో పోలీసులే ఇబ్బంది పడతారని హెచ్చరించారు. సమావేశంలో తిమ్మాపురం ఎంపీటీసీ సభ్యుడు ముద్దన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాపురం సర్పంచ్‌ సహా 10 మందిపై కేసు

తిమ్మాపురం గ్రామంలో శివాలయం వద్ద బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు, గ్రామ సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ సహా మొత్తం 10 మందిపై ఎస్సై గణేష్‌ కుమార్‌ కేసు చేశారు. ఈ పది మందిలో బెజవాడ సత్యనారాయణ, బెజవాడ భాస్కరరావు, ఎలుగంటి నూకరాజు (రాజా), బద్దిలి అచ్చారావు, కొల్లకోట ఆదివిష్ణు, గంగుమళ్ళ సాంబశివలను గురువారం శివాలయం వద్ద అరెస్టు చేసి, కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచి, రిమాండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement