కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని దర్శనానికి భక్తులు వస్తూనే ఉన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. పార్కింగ్ స్థలాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు జరిగాయి. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. ఆలయ ప్రాంగణం, ప్రసాద విభాగం, అన్నదానం, వ్రతాలు తదితర ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. నిత్యాన్నదాన పథకంలో భక్తులతో కలసి భోజనం చేశారు. ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో భక్తుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. ఒక్క వ్రత విభాగం ద్వారానే రూ.20 లక్షలు సమకూరాయి. ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చాయి. మహా శివరాత్రి పర్వదినం కావడంతో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది.
రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మహాశివరాత్రి సందర్భంగా సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ సెలవుగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఆ రోజు జిల్లావ్యాప్తంగా జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేశారు. కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
‘బెజవాడ’కు అండగా ఉంటాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణపై తప్పుడు కేసులు పెట్టి పోలీసులు వేధిస్తున్నారని, ఆయనకు తామంతా అండగా ఉంటామని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత తెలిపారు. శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, రాజ్యాంగం అమలులో రాష్ట్రం వెనుకబడి ఉందని కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. సర్పంచ్ బెజవాడపై కావాలనే లేనిపోని కేసులు పెట్టి పలు స్టేషన్ల చుట్టూ తిప్పి వేధించారన్నారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే ప్రభుత్వం చెప్పిందని సర్పంచ్‌ను జైల్లో పెట్టేందుకు ఏకపక్షంగా కేసు పెట్టారన్నారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదన్నారు. ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగితే ఒక్కరి పైనే కేసు పెట్టడం చూస్తేనే పరిస్థితి అర్థమవుతోందన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి, కుమార్, పార్టీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర లక్ష్మీప్రసన్న ఉన్నారు.
కిక్కిరిసిన రత్నగిరి


