కార్మికులంటే కట్టు బానిసలా? | - | Sakshi
Sakshi News home page

కార్మికులంటే కట్టు బానిసలా?

Feb 15 2026 7:36 AM | Updated on Feb 15 2026 7:36 AM

కార్మికులంటే కట్టు బానిసలా?

కార్మికులంటే కట్టు బానిసలా?

పలు సంస్థలు, పరిశ్రమల్లో

దుర్భర పరిస్థితులు

సీఐటీయూ నేత శేషుబాబ్జీ

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కొన్ని పరిశ్రమల్లో కార్మికులను కట్టు బానిసల్లా చూస్తున్నారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ ఆరోపించారు. కచేరీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, కోశాధికారి మలకా రమణ తదితరులతో కలసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న సార్వత్రిక సమ్మె సందర్భంగా కార్మికుల సమస్యలపై జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. సర్వేలోని అంశాలపై ఆయన చెప్పిన వివరాలివీ..

● అన్నవరం దేవస్థానంలో 20 సంవత్సరాలుగా పని చేస్తున్న శానిటేషన్‌ కార్మికుల్లో 50 ఏళ్ల వయసు దాటిన వారిలో 40 మందిని కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్‌ తొలగించారు. మరో 30 మందికి నెల రోజులుగా డ్యూటీలు నిలుపుదల చేసినా జిల్లా యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. పైగా వారి స్థానంలో తమవారిని పెట్టుకోవాలంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు సిఫారసులు చేయడం హేయం.

● రాక్‌ సిరామిక్స్‌, పట్టాభి ఆగ్రో, కాకినాడ సీపోర్టులలో స్థానికులను తొలగించి, వలస కార్మికులతో పనులు చేయించుకోవడం పెరిగింది. ఆ వలస కార్మికులకు చట్ట ప్రకారం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఒకే రూములో 20 మందిని ఉంచి పని చేయించుకుంటున్నారు.

● కాకినాడ సీ పోర్టులో పని చేసే కార్మికులకు కనీసం మంచినీటి, భోజన వసతి, వాహనాల పార్కింగ్‌ సౌకర్యాలు లేవు. పని చేయించుకుని వేతనాలివ్వకుండా తిప్పించుకుంటున్నారు.

● కాకినాడ మెయిన్‌ రోడ్డులోని షాపింగ్‌ మాల్స్‌లో పని చేసే కార్మికులకు కూర్చునే సౌకర్యాలు కూడా లేవు. 12 గంటలు పని చేయించుకుంటూ, 8 గంటల వేతనం కూడా చెల్లించడం లేదు.

● జిల్లాలో కేరళ యాజమాన్యంలోని జీడిపిక్కల పరిశ్రమలు మొత్తం మూతపడ్డాయి. సామర్లకోట షుగర్‌ ఫ్యాక్టరీ, చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమలను ప్రత్యామ్నాయం చూపకుండా మూసివేయడంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

● కాకినాడ పారిశ్రామికవాడలోని ప్యారీ షుగర్స్‌ యాజమాన్యం మారుతూండటంతో ఉద్యోగ భద్రతపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

● ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం పడిపోయింది. దీంతో, వాయిదాలు కట్టలేకపోవడంతో వారిపై ఫైనాన్సర్ల వేధింపులు పెరిగాయి. ప్రభుత్వం తక్షణం రుణాలు మంజూరు చేసి, ఆటో కార్మికులను ఆదుకోవాలి.

● జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్‌ వంటి ఆన్‌లైన్‌ యాప్‌లపై పని చేసే గిగ్‌ వర్కర్ల సంఖ్య పెరిగింది. రోజంతా కష్టపడినా రూ.500కు మించి ఆదాయం రావడం లేదు. ప్రభుత్వమే ఆన్‌లైన్‌ యాప్‌ ఏర్పాటు చేయడం ద్వారా వీరి ఆదాయం పెంచాలి.

● భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో రూ.3 వేల కోట్లు మూలుగుతున్నా ఒక్క కుటుంబానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement