దొంగతనాలకు ‘తాళం’ తెరిచి..
అన్నవరం: రోడ్డుపై చూస్తారు.. రానూ పోనూ గమనిస్తారు.. పాత బైక్‌ల తాళం అరిగిపోవడాన్ని గుర్తించి చాకచక్యంగా తెరిచేస్తారు.. వెంటనే ఆ బైక్‌ను అక్కడి నుంచి దొంగిలిస్తారు.. ఇలా పలు జిల్లాల్లో 51 మోటారు సైకిళ్లు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అన్నవరం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా జిల్లాలో పలుచోట్ల మోటారు సైకిళ్ల దొంగతనాలు జరుగుతుండటంతో దర్యాప్తునకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అన్నవరం పోలీస్ సిబ్బందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందం వలపన్ని కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన దాసరి దుర్గాప్రసాద్, శాఖా ప్రసాద్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 25 లక్షల విలువైన 51 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి నుంచి బైక్‌లు కొనుగోలు చేసిన రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన నల్లమిల్లి దొరస్వామిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పాత బైక్‌ల తాళం అరిగిపోవడాన్ని గమనించి చాకచక్యంగా తాళం తెరిచి అపహరిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా యూనికార్న్ బైక్‌ల తాళం తీయడానికి కొత్త పరికరాలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. వీరిపై కాకినాడ జిల్లాలో 41, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పది కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన ప్రత్యేక టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ ఎస్వీ రమణ, కానిస్టేబుల్స్ ఎం.నాగేశ్వరరావు, ఎన్.శ్రీను, హోం గార్డులు కె.నాగేశ్వరరావు, పి.అచ్యుతరామ్, పి.సత్తిబాబులను ఎస్పీ అభినందించారు.
ఫ అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
ఫ 51 మోటారు సైకిళ్ల స్వాధీనం


