ఆదు‘కొనలేం’ | Grain purchases halted as target met | Sakshi
Sakshi News home page

ఆదు‘కొనలేం’

Apr 23 2025 4:33 AM | Updated on Apr 23 2025 4:33 AM

Grain purchases halted as target met

కూటమి సర్కారు నిర్వాకం  

చేతులెత్తేసిన అధికారులు  

లక్ష్యం పూర్తయిందని ధాన్యం కొనుగోళ్లు నిలిపివేత.. 

‘తూర్పు’లో రైతుల పడిగాపులు   

రంగంలోకి దిగిన దళారులు  

తక్కువ ధరకు కొనుగోళ్లు   

అందినకాడికి తెగనమ్ముకుంటున్న అన్నదాతలు 

50% కూడా పూర్తికాని వరి కోతలు  

అప్పుడే లక్ష్యం పూర్తయిందన్న ప్రభుత్వ ప్రకటనపై విస్మయం    

రైతులను కూటమి ప్రభుత్వం నిండా ముంచింది. వరి కోతలు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. అప్పుడే ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని, ఇక కొనడం కుదరదని చెప్పేసింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో ధాన్యం రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కూటమి ప్రభుత్వం తీరు వల్ల ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు ఆపసోపాలు పడుతున్నారు. రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తిరిగి ఇళ్లకు తరలించలేక కర్షకులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్కారు కరుణిస్తుందేమోనని ఆశగా నిరీక్షిస్తున్నారు.– సాక్షి, రాజమహేంద్రవరం

తప్పుడు లెక్కలు  
తూర్పుగోదావరి జిల్లాలో వరి సాధారణ విస్తీర్ణం రబీలో 60,042 హెక్టార్లు. ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 4 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేందుకు 216 ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 

రోజుల వ్యవధిలోనే 1.35 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించామని, 65 వేల మెట్రిక్‌ టన్నులు సేకరించి కేంద్రాలు మూసివేస్తామని పేర్కొంటున్నారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 50శాతం కోతలు కూడా పూర్తికాలేదని, పండించిన ధాన్యం మొత్తం తమ వద్దే ఉందని, అలాంటప్పుడు లక్ష్యం ఎలా పూర్తవుతుందని ప్రశి్నస్తున్నారు. అధికారులు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

దళారుల దందా 
ఈ నేపథ్యంలో దళారులు దందా సాగిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఆసరాగా తీసుకుని రైతులను దోచుకుంటున్నారు. తక్కువ ధరకే ధాన్యాన్ని ఎగరేసుకుపోతున్నారు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్దేశించిన ధర రూ.1,725 ఉండగా దళారులు రూ.1,300 నుంచి రూ.1,500కు కొంటున్నారు. గత్యంతరం లేని స్థితిలో అన్నదాతలు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు.  

గత ప్రభుత్వ హయాంలో పండిన ప్రతి గింజా కొనుగోలు
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల హడావుడి ఉన్నా.. రైతులకు ఎంలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి రైతు భరోసా కేంద్రాల్లో 231 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించిన వెంటనే కొనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే నాటి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్‌కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. పండిన ప్రతి గింజా కొన్నది.  

మరో 15 రోజుల్లో 75శాతం కోతలు పూర్తి  
జిల్లావ్యాప్తంగా రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సోమవారం నాటికి 28,287 హెక్టార్లలో (48.3 శాతం) పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో 75 శాతానికిపైగా పూర్తవనున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇంకా కోతలు పూర్తవకుండానే అధికారులు ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తయిందని ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది.

ధాన్యం తీసుకోవడం లేదు
రైతు సేవా కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకెళుతుంటే లక్ష్యం పూర్తయిందంటున్నారు. మళ్లీ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు నిరీక్షించాలని చెబుతున్నారు. అప్పటి వరకూ ధాన్యం పెట్టుకుని ఉండాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో భయమేస్తోంది. ధాన్యం అమ్మినా చెల్లింపులు జరగడం లేదు. రైతు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి.  – గారపాటి వెంకట సుబ్బారావు, రైతు సంఘం నేత, చాగల్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement