న్యాక్‌ ఉద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి

Gowtham Reddy Punuru Comments About NAC employees issues - Sakshi

ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ పూనూరు గౌతంరెడ్డి 

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి, న్యాక్‌ చైర్మన్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళతానని ఏపీ ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పూనూరు గౌతంరెడ్డి చెప్పారు. విజయవాడలో ఆదివారం న్యాక్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ యూనియన్‌ మొదటి మహాసభ జి.శంకరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతంరెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి న్యాక్‌ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వారి జీవితాలకు భరోసా కల్పించారని చెప్పారు. న్యాక్‌ పరిధిని పెంచి వర్కర్లను రెగ్యులరైజ్‌ చేస్తానన్నారని, కానీ ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు వీళ్లందరిని తొలగించాలని కుట్రపూరితంగా వ్యవహరించాయని పేర్కొన్నారు.

న్యాక్‌లో టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌ అర్హత కలిగిన 250 మంది 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నా గత ప్రభుత్వాలు ఉద్యోగ భద్రతను కల్పించకపోవడం శోచనీయమన్నారు. సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన పీఆర్సీ, టైం స్కేల్, సమానపనికి సమాన వేతనం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వైఎస్సార్‌టీయూసీ  రాష్ట్ర నాయకుడు ఎన్‌.రాజారెడ్డి ప్రసంగించారు. వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్, న్యాక్‌ సిబ్బంది జి.శంకర్, సుధాకర్, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
అనంతరం న్యాక్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ యూనియన్‌ (న్యూ) రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎన్‌.రాజారెడ్డి, అధ్యక్షుడిగా జి.శంకరయ్య, ఉపాధ్యక్షులుగా ఎం.వసంతరావు, జీఎస్‌ నారాయణరెడ్డి, ఈఎస్‌ శ్యామ్‌బాబు, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్, సహాయ కార్యదర్శులుగా డి.టి.రాజాబాబు, టి.సురేష్‌బాబు, వి.బి.పి.విజయలక్ష్మి, ఎస్‌.సుధాకర్, కోశాధికారిగా డి.కిరణ్‌కుమార్‌రెడ్డిలను 
ఎన్నుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top