వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌పై సర్కారు కవరింగులు | Government coverage of the Webland hack | Sakshi
Sakshi News home page

వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌పై సర్కారు కవరింగులు

Oct 9 2026 5:49 AM | Updated on Oct 9 2026 5:49 AM

Government coverage of the Webland hack

రొటీన్‌ మెయింట్‌నెన్స్‌ కోసం రెండ్రోజులు పోర్టల్‌ నిలిపివేసినట్లు వివరణ 

నిర్వహణ కోసం వెబ్‌ల్యాండ్‌ ఆగడం ఎప్పుడూ లేనేలేదు 

హ్యాకింగ్‌ నిజమైనా అంగీకరించకుండా బుకాయింపు 

వెబ్‌ల్యాండ్‌లో బయటి వ్యక్తుల ప్రవేశం నిజమేనని అంగీకారం  

సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అయిన విషయాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో ఉలిక్కిపడిన చంద్రబాబు ప్రభుత్వం దాని కవరింగ్‌ కోసం నానా తంటాలు పడుతోంది. ‘వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌’ పేరుతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఇచ్చిన వివరణలోనే వారి తప్పులన్నీ బయటపడ్డాయి. వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అవలేదని కేవలం రొటీన్‌ మెయింటెనెన్స్‌ కోసం 6వ తేదీ నుంచి రెండ్రోజులపాటు తామే సర్వర్లు నిలిపివేశామని తెలిపింది. అయితే, నిర్వహణ పేరుతో గతంలో ఎప్పుడూ వెబ్‌ల్యాండ్‌ను డౌన్‌ చేసిన సందర్భాలు లేవు. 

ప్రజలకు సంబంధించిన వివరాలు, సేవలతో ముడిపడి ఉన్న పోర్టల్స్‌ను మెయింటెనెన్స్, ఇతర కారణాలతో నిలిపివేస్తే ఆ విషయాన్ని ముందుగా ప్రజలకు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో సమాచారం ఇస్తారు. కానీ, ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌ డౌన్‌ చేస్తే ముందే ఎందుకు ప్రకటించలేదు? ఏ కార్యాలయానికీ సర్క్యులర్‌ ఎందుకు పంపలేదు? ఇలాంటివి రాత్రి, సెలవు రోజుల్లో కాకుండా పని దినాల్లో, కార్యాలయాల పనివేళల్లో ఎందుకు ఆపేశారు? ఈ రెండ్రోజులు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగవని ఎందుకు ముందస్తుగా ప్రజలకు చెప్పలేదనే దానికి ప్రభుత్వం నుంచి సమాధానంలేదు.

అయితే, రిజిస్ట్రేషన్లు ఎందుకు చేయడంలేదని క్రయవిక్రయాల కోసం వచ్చిన వారు సబ్‌ రిజిస్టర్ కార్యాలయాల్లో అడిగితే వెబ్‌ల్యాండ్‌ పనిచేయడంలేదని, ఆగిపోయిందని చేతులు దులుపుకున్నారు. నిర్వహణ కోసం నిలిచిపోయినట్లు ఎవ్వరూ చెప్పలేదు. అసలు మెయింట్‌నెన్స్‌ కోసం వెబ్‌ల్యాండ్‌ ఆగడం ఎప్పుడూ చూడలేదని రెవెన్యూ శాఖాధికారులే చెబుతున్నారు. అంటే.. ప్రభుత్వం ఇచ్చిన వివరణ కవరింగేనని స్పష్టమవుతోంది.  

ఊరూ, పేరు లేకుండా గుడ్డిగా వివరణ.. 
చివరికి.. సమాచార శాఖ ఇచ్చిన ఈ వివరణలో కనీసం ఏ శాఖ, ఏ అధికారి వివరణ పంపారో కూడా లేకపోవడం గమనార్హం. ఊరూ, పేరు లేకుండా కనీసం ఎక్కడ నుంచి వివరణ వచ్చిందో కూడా లేకుండా గుడ్డిగా రిజాయిండర్‌ పంపడాన్ని బట్టి ప్రభుత్వం, రెవెన్యూ శాఖలు ఎంత లోపభూయిష్టంగా పనిచేస్తున్నాయో అర్థంచేసుకోవచ్చు.  

సర్కారు డొల్లతనం బయటపడుతుందని.. 
ఇక వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అయిన విషయం నిజమే అయినా దాన్ని అంగీకరిస్తే భూ రికార్డుల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం డొల్లతనం బయటపడుతుందని తప్పును సమర్థించుకుంటున్నారు. పోర్టల్‌ను ఓపెన్‌ చేస్తే గురువారం రాత్రి వరకూ హ్యాక్‌ అయినట్లు స్పష్టంగా కనిపించింది. అయినా హ్యాక్‌ కాలేదని సర్కారు బుకాయిస్తోంది. అలాగే, ప్రైవేటు వ్యక్తులకు లాగిన్‌లు ఇవ్వలేదని చెబుతూనే ఎన్‌ఐసీ ద్వారా నియమించిన రిసోర్స్‌ పర్సన్లకు వెబ్‌ల్యాండ్‌ లాగిన్‌లు ఉన్నాయని ప్రభుత్వం ఒప్పుకుంది. అన్నింటికీ మించి.. కీలకమైన భూముల వ్యవహారాలు, రైతుల రుణాలు, ఈ–క్రాప్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయ సర్వర్‌ కూడా లేకపోవడం మరో వైఫల్యమేనని ఒప్పుకున్నట్లైంది. బ్లాక్‌చెయిన్, ఐటీ వంటి గొప్పలు చెప్పే ప్రభుత్వం కనీసం బ్యాకప్‌ కూడా సిద్ధంచేయలేకపోవడం ఏమిటని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement