
మాజీ సీఎం జగన్, గత ప్రభుత్వంపై తరచుగా గోరంట్ల విమర్శలు
వయసు, అనుభవం పక్కనపెట్టి మరీ దిగజారుడు వ్యాఖ్యలు
మంత్రి పదవి కోసమే ఈ తాపత్రయం అంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల తన వయసు, అనుభవాన్ని పక్కన పెట్టేసి మరీ తరచుగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆయన తరచుగా దుర్భాషలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. అందులో స్థానం దక్కించుకునే కాంక్షతోనే ఆయన ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హద్దు మీరి మరీ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ నేతలపై తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారుతోంది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, అవి కూడా హద్దులో ఉండటమే సమాజానికి హితం. కానీ, బుచ్చయ్య వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దు దాటేస్తున్నాయి. మాజీ సీఎం అనే కనీస గౌరవం కూడా లేకుండా మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లలో ఇష్టమొచ్చినట్లు అన్‌స్టాపబుల్‌గా తప్పుడు వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ‘నువ్వు ఓ సైకో. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పులేదు?’ అంటూ జగన్‌నుద్దేశించి ఆయన ఊగిపోతూ మాట్లాడుతున్నారు. గోరంట్ల ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ అధిష్టానం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా చూస్తూంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే భావన కలుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
మంత్రి పదవి కోసమేనా?
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిగా విఫలమైంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కూటమి సర్కారు ప్రజలకు చేస్తున్న అన్యాయం, దగాను ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. దీంతో, ఆత్మరక్షణలో పడిన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. ఆ సందర్భంగా సీనియర్లకు మంత్రి పదవులిచ్చి మాజీ సీఎం జగన్‌ను, వైఎస్సార్ సీపీపై విమర్శల దాడిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈసారైనా తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అనే ఆశతోనే గోరంట్ల స్వరం మార్చినట్లు తెలుస్తోంది.
జగన్‌ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో ఏమో కానీ ఎన్నడూ లేని విధంగా ఆయన కొన్ని రోజులుగా నిందా వ్యాఖ్యలకు దిగుతున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టిలో పడేందుకు పాట్లు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, బుచ్చయ్య ఎంత ట్రై చేసినా మంత్రి పదవి దక్కదని టీడీపీ నేతలే అంటున్నారు.
గత అవమానాలు మరిచారా?
సీనియర్ నేతయిన బుచ్చయ్య చౌదరి టీడీపీలో ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎనీ్టఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు వెన్నుపోటు ఉదంతంలో గోరంట్ల.. ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. పారీ్టలోనే ఉన్నా తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలి ఇష్టం లేకపోయినా పారీ్టలో సీనియర్ అనే కారణంతో చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసేవారు. పారీ్టపై ఉన్న అభిమానంతో గోరంట్ల కూడా అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వపక్షంపై ఆయన చేసిన వ్యాఖ్యలను గమనించిన చంద్రబాబు అప్పటి నుంచీ బుచ్చయ్యను పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది.
యువగళం పాదయాత్ర, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తనయుడు లోకేష్ టీడీపీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారారు. దీంతో, గోరంట్ల ప్రాబల్యం మరింత తగ్గింది. చంద్రబాబు జైలులో ఉన్న 52 రోజులూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. లోకేష్ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, బాబుతో ఒక్కసారి కూడా ములాఖత్ ఏర్పాటు చేయలేదంటే టీడీపీలో బుచ్చయ్య పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి ఇవ్వకపోయినా, తరచుగా అవమానిస్తున్నా గోరంట్ల ఇప్పటికీ వారినే పొగుడుతూంటారు. వారి దృష్టిలో పడేందుకే మాజీ సీఎంను విమర్శిస్తున్నారని, మంత్రి పదవి కోసమే ఆయన స్వరం పెంచారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వయసు, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మంత్రి పదవి కోసం ‘నరుకుతాను, ఉరి తీయాలి’ అని మాట్లాడటం సబబేనా? తన నియోజకవర్గంలో రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబును నిలదీయాలి. గోదావరి నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలించి బుచ్చయ్య చౌదరి సాగిస్తున్న దందా గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయి అమ్మకాల్లో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అయినప్పటికీ వాటిని తయారు చేస్తున్న డిస్టిలరీలను ఈ ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయడం లేదు? బుచ్చయ్య చౌదరి చెప్పినట్లు ఉరి తీయాలనుకుంటే ఈ ప్రభుత్వంలో అక్రమంగా మద్యం, గంజాయి, ఇసుక తరలించే వారిని ఉరి తీయాలి. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్ని వంచించిన కూటమి నాయకులే బుచ్చయ్య చౌదరి చెప్పిన ఉరి శిక్షకు అర్హులు.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు