ఏపీకి గోదావరి బోర్డు లేఖ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాజెక్టులకు 940.87 టీఎంసీల జలాలను వినియోగించుకోవడానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)లోని వివిధ డైరెక్టరేట్లతో పాటు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) ఇచ్చిన అనుమతుల పత్రాలు ప్రాజెక్టుల వారీగా అందజేయాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)ను ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై గోదావరి బోర్డు స్పందిస్తూ ఆయా విభాగాల నుంచే నేరుగా ఆ సమాచారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలపై ఇరు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అత్యున్నత స్థాయి పరిపాలన, సాంకేతిక విభాగాల అధికారులతో పాటు సీడబ్ల్యూసీలో ప్రాజెక్టుల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టులు(పీఎఫ్‌ఆర్), డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్)లను మదింపు జరిపే అధికారులూ ఉన్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అవసరమైన పత్రాలు, సమాచారాన్ని కోరుతూ నేరుగా కమిటీకి విజ్ఞప్తి చేయాలని ఏపీకి సూచించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ (ఇరిగేషన్)కి గోదావరి బోర్డు శుక్రవారం లేఖ రాసింది.


