నా పేరు సలాది నరసింహమూర్తి. మాది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం. నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నాకు భార్య ఆదిలక్ష్మి, కుమారులు శేష శ్రీనివాస్, సుధీర్‌కుమార్ ఉన్నారు. 2016, 2018లో వరుసగా సంభవించిన తుపానుల కారణంగా మా పొలంలో పంట కోసే పరిస్థితి లేకుండాపోయింది. అదేవిధంగా నాటి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల అప్పులపాలై ఆర్థికంగా చితికిపోయాను. చివరికి ఎడ్ల బండిని తోలుకుంటూ కుటుంబాన్ని పోషించాల్సి వచ్చింది.
అప్పుల భారం ఎక్కువకావడంతో ఉన్న రెండు ఎకరాల భూమి అమ్మకానికి పెట్టాను. అయితే 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు రాయితీపై అందించడంతో ఉపశమనం కలిగింది. నేను పండించిన పంటను కూడా ఆర్బీకేలోనే మద్దతు ధరకే కొనుగోలు చేయడంతో ఆరి్థకంగా మేలు జరిగింది. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందాయి.
ఇక ముఖ్యంగా ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించడంతో 2021లో తుపాను వచ్చినప్పుడు ఒకేసారి రూ.1.20లక్షల బీమా సొమ్ము నా ఖాతాలో జమైంది. దీంతో అప్పులు తీర్చుకున్నాను. పొలం అమ్మకం ఆలోచనను విరమించుకుని ఆనందంగా జీవిస్తున్నాము. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక బీమా దూరమైంది. వ్యవసాయానికి భరోసా కరువైంది. – తాళ్లరేవు
నాడు ఎప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు అప్పుడే..
నా పేరు మార్కపూడి పుల్లారావు. మాది ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కె.పొన్నవరం గ్రామం. నాకు ఎకరన్నర పొలం ఉంది. ఏటా నా సొంత పొలంతోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, మిర్చి సాగు చేస్తున్నాను. నా భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటున్నాం. ఎన్నడూ లేనివిధంగా వైఎస్ జగన్ హయాంలో రైతులకు కష్టం తెలియకుండా ప్రతి దశలోనూ ఆదుకున్నారు. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున నా ఖాతాలో జమ చేశారు.

2022లో మిర్చి భారీగా దెబ్బతిని అప్పులపాలైపోయాను. ఆ సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఎకరానికి రూ.49,500 చొప్పున... రెండు ఎకరాలకు రూ.99,000లను అదే సీజన్‌లో నా బ్యాంక్ ఖాతాలో జమ చేసి ఆదుకున్నారు. 2023లో తుపానుకు వరి పంట దెబ్బతింటే ఎకరానికి రూ.10 వేలు చొప్పున రెండున్నర ఎకరాలకు రూ.25 వేలను వారం రోజుల్లో జమచేసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించారు. 2022లో వడ్డీ లేని రుణం రూ.లక్ష అందించారు.
ఆర్బీకేల ద్వారా సాగుకు అండగా నిలిచారు. ఇలా రాష్ట్రంలో రైతులందరినీ ఆదుకున్న మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. కాగా, చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20వేలు ఇస్తానని, రెండేళ్లకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.10 వేలు మాత్రమే ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టారు.


