మీ త్యాగం మరువం సైనికా.. | Funeral of CRPF Cobra Commander Shakhamuri Muralikrishna was ended | Sakshi
Sakshi News home page

మీ త్యాగం మరువం సైనికా..

Apr 7 2021 3:56 AM | Updated on Apr 7 2021 3:56 AM

Funeral of CRPF Cobra Commander Shakhamuri Muralikrishna was ended - Sakshi

మురళీకృష్ణ పార్థివదేహానికి సెల్యూట్‌ చేస్తున్న కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఎస్పీ విశాల్‌ గున్ని, పక్కన ఎమ్మెల్యే అంబటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

విజయనగరం క్రైమ్‌/సత్తెనపల్లి: చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో అమరత్వాన్ని పొందిన విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన ఆర్మీ జవాన్‌ రౌతు జగదీశ్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణల అంత్యక్రియలు మంగళవారం అశ్రునయనాల మధ్య ముగిశాయి. జగదీశ్‌ మృతదేహానికి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావులు నివాళులర్పించారు. జోహార్‌ జగదీశ్, భారత్‌ మాతాకీ జై అంటూ ఓ వైపు ఎన్‌సీసీ విద్యార్థులు, మరోవైపు అభిమానులు, మిత్రులు, కుటుంబసభ్యులు నినదిస్తుండగా గాజులరేగ దిగువ వీధిలో ఉన్న ఇంటి నుంచి మేళతాళాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య జగదీష్‌ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తరలించారు.
జవాన్‌ రౌతు జగదీశ్‌ అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు 

అక్కడ సీఆర్‌పీఎఫ్‌ బలగాలు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ బలగాలు మౌనం పాటించగా పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు జగదీష్‌ మృతదేహంపై ఉన్న జాతీయ జెండాను తీసి అతని తండ్రి సింహాచలానికి అందజేశారు. అనంతరం ఆయన అంత్యక్రియాలు నిర్వహించారు. అలాగే, శాఖమూరి మురళీకృష్ణ (32) పార్థివదేహం మంగళవారం ఉదయం గుడిపూడిలోని ఆయన స్వగృహానికి చేరుకుంది. ప్రత్యేక వాహనంలో సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మురళీకృష్ణ పార్థివదేహాన్ని తీసుకువచ్చాయి. తర్వాత తాలూకా సెంటర్‌లోని సత్తెనపల్లి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట పార్థివదేహాన్ని కొద్దిసేపు ఉంచి బాణాసంచా కాల్చారు. అనంతరం ప్రత్యేక వాహనంపై మురళీకృష్ణ పార్థివదేహాన్ని ఉంచారు.

యువకులు బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. సత్తెనపల్లి నుంచి గుడిపూడి వరకు 100 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శనగా తీసుకువెళ్లారు. గ్రామంలో మురళీకృష్ణ ఇంటి వద్ద పార్థివదేహాన్ని బాక్సులో నుంచి తెరిచి తల్లిదండ్రులకు చూపించారు. మురళీకృష్ణ మృతదేహానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్, ఐజీ త్రివిక్రమ వర్మ, జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ తదితరులు ఘనంగా నివాళులర్పించారు. శ్మశాన వాటికలో సీఆర్పీఎఫ్‌ పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement