నేటి నుంచి ఉచిత బోరు తవ్వకాలు ప్రారంభం

Free Bore Excavations Start From 10th November - Sakshi

నాలుగేళ్లలో మొత్తం 2 లక్షలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను పట్టణ ప్రాంతంలోని వాటిని మినహాయిస్తే 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తొలి బోరు తవ్వకం కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జలకళ పథకం అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ పథకంలో ఉచిత బోరుతో పాటు మోటార్‌ లేదా పంపుసెట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వడం ద్వారా ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకరావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బోర్లు తవ్వకానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, వాటర్‌ షెడ్స్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి సోమవారం జిల్లాల పీడీలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని చోట్ల డ్రిల్లింగ్‌ కార్యక్రమం ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే తొలి బోరు తవ్వకం పనులు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top