
ఆటలాడుతూ కారులోకి ఎక్కిన పసి మనసులు
హఠాత్తుగా డోర్ లాక్
ఊపిరాడక నలుగురు మృతి
మృతుల్లో ఇద్దరు అక్కచెల్లెళ్లు
పట్టపగలు విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాద ఘటన
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది
పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.
వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్‌ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్‌ఐ రామ్‌గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
