
స్టీల్‌ప్లాంట్‌ను కాపాడాలంటూ వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చిన ఉక్కు కార్మికులు
విశాఖ ఉక్కు కార్మికులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా
స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడమే లక్ష్యం
కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాడదాం
అధికారంలో ఉన్నా.. విపక్షంలో ఉన్నా.. మేం ఎప్పుడూ కార్మికుల పక్షానే
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పంతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్ జగన్‌ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడాలని కోరారు. కాకానినగర్ వద్ద వారంతా వైఎస్ జగన్ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ, కార్మిక సంఘం నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ తాజా పరిణామాల గురించి చర్చించారు.
స్టీల్ ప్లాంట్‌ను కాపాడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నంత వరకూ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేట్‌పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని వాపోయారు.
స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం.. సెయిల్‌లో విలీనం చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులను తిరిగి వి«ధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్లతో పోరాటం చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
సంఘటితంగా పోరాడదాం..
స్టీల్ ప్లాంట్ కార్మికుల విన్నపాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. వారి ప్రతి డిమాండ్‌ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా.. ఎప్పుడూ తమ వైఖరి ఒక్కటేనని, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. వైఎస్సార్‌సీపీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అన్ని డిమాండ్లపైనా కలసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు.