
సాక్షి, అమరావతి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 4.73 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 20,651 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది.
ఆల్మట్టి డ్యామ్, నారాయణ్‌పూర్ డ్యామ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,25,164 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 1,21,448 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన సుంకేశుల బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1,27,840 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి 2,71,763, సుంకేశుల నుంచి 1,25,660, హంద్రీ నుంచి 2 వేలు వెరసి 3,90,135 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దాంతో శ్రీశైలంలో 881.9 అడుగుల్లో 198.36 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్ వే 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,44,750, విద్యుదుత్పత్తి చేస్తూ 65,436 క్యూసెక్కులు కలిపి 4,10,186 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

నాగార్జునసాగర్‌లోకి 4,10,186 క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలను నిల్వ చేస్తూ 26 గేట్లను ఎత్తి 4.09 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,97,807 క్యూసెక్కులు చేరుతుండగా.. 166.47 అడుగుల్లో 33.54 టీఎంసీలను నిల్వ చేస్తూ 4,13,395 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, వాగులు, వంకల వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 4,73,065 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గోదావరిలోనూ పెరుగుతున్న వరద
ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టులోకి 8,29,424 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,63,310 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు.
పోటెత్తిన నాగావళి, వంశధార
ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తుతోంది. నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 22 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ.. 20,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
వర్షాల నేపథ్యంలో సెలవులు తీసుకోవద్దు
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ లైన్‌మెన్ నుంచి అధికారుల వరకు ఎవరూ సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున విద్యుత్‌సంస్థల అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో 16 జిల్లాలకు కలిపి అత్యవసర వరద సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకో రూ.కోటి చొప్పున కేటాయించింది.
విలీన మండలాల్లో 80 గ్రామాలకు రెండో రోజూ నిలిచిన రాకపోకలు
చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి మంగళవారం సాయంత్రం నుంచి క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు శబరి నదిలోనూ మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద పెరుగుతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో వరుసగా రెండోరోజు కూడా 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చింతూరు మండలంలో కుయిగూరు వాగు వరద తగ్గకపోవడంతో ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై రాకపోకలు సాగక వాహనాలు చింతూరులో నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు, కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వద్ద వరద ఇంకా రహదారులపైనే నిలిచి ఉంది. కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్‌వేపై వరదనీరు ఇంకా తొలగలేదు.